
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణ హత్య?
బంగ్లాదేశ్‌లో మత మైనారిటీల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, నర్సింగ్‌దీ జిల్లాలో 25 ఏళ్ల హిందూ యువకుడు చంచల్ భౌమిక్‌ను సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చంచల్ భౌమిక్ ఒక గ్యారేజీలో నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది షట్టర్‌ను పగలగొట్టి లోపలికి వెళ్లినా, అప్పటికే యువకుడు పూర్తిగా కాలిపోయి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నర్సింగ్‌దీ పోలీస్ సూపరింటెండెంట్ అబ్దుల్లా అల్ ఫారూక్ మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజీలో అనుమానాస్పద వ్యక్తి ఒకరు ఘటన స్థలంలో సంచరిస్తున్నట్లు కనిపించిందని తెలిపారు. దుకాణం లోపలే మంటలు చెలరేగాయి. అయితే సీసీటీవీ దృశ్యాల్లో ఒక వ్యక్తి కదలికలు కనిపిస్తున్నాయి. ఇది విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమా? లేక బయటి నుంచి ఎవరైనా మంటలు పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటన బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న అస్థిర భద్రతా పరిస్థితుల మధ్య చోటు చేసుకోవడం గమనార్హం. ఫిబ్రవరి 12, 2026న జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవామీ లీగ్‌పై నిషేధం, పెరుగుతున్న మత ఉద్రిక్తతల నేపథ్యంలో మైనారిటీల భద్రత అంతర్జాతీయంగా ఆందోళనకర అంశంగా మారింది. మానవ హక్కుల సంస్థలు, ప్రభుత్వ వర్గాల నివేదికల ప్రకారం, ఆగస్టు 2024లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలపై దాడులు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితులపై ప్రతిస్పందించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, భారత్‌లో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తూ, దేశం భయానక కాలంలోకి జారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ నేడు రక్తసిక్తమైన నేలగా మారింది. దేశమంతా ఒక భారీ జైలుగా, మరణ లోయగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చివేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా జనవరిలో లండన్ పార్లమెంట్ స్క్వేర్‌లో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింసపై అంతర్జాతీయ దృష్టి సారించాలంటూ భారీ నిరసన కార్యక్రమం జరిగింది. బంగ్లాదేశ్ హిందూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో 500 మందికి పైగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ హిందూ–బౌద్ధ–క్రైస్తవ ఐక్య మండలి తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ నెలలోనే 51 మత హింస ఘటనలు నమోదయ్యాయి. వీటిలో
10 హత్యలు, 10 దోపిడీ ఘటనలు, ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థలపై దాడులు, అగ్నిప్రమాదాలు, తప్పుడు కేసులతో అరెస్టులు, హింస, లైంగిక దాడికి ప్రయత్నం, శారీరక దాడులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో, తాత్కాలిక ప్రభుత్వ పాలనలో మైనారిటీలపై 2,900కుపైగా హింస ఘటనలు చోటు చేసుకున్నాయని స్వతంత్ర నివేదికలు వెల్లడించాయని పేర్కొంది. ఈ ఘటనలను దేశంలోని శాంతిభద్రతల సమస్యతో అనుసంధానించింది. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, మత మైనారిటీల భద్రతపై ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
