Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి..పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి..పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Shaik Mohammad Shaffee
3 జనవరి, 2026

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూ మతానికి చెందిన ఓ వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా దాడి చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స కోసం ఢాకాకు తరలించారు.

ఇంటికి వస్తుండగా అడ్డగించి దాడి

పోలీసుల కథనం ప్రకారం, శరియత్‌పూర్ జిల్లా దముద్యా ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్ (50)పై ఈ ఘాతుకం జరిగింది. బుధవారం రాత్రి తన దుకాణం మూసివేసి ఆటోరిక్షాలో ఇంటికి వెళ్తుండగా, కియుర్‌భంగా బజార్ సమీపంలో దుండగులు అడ్డుకున్నారు. ఆయన్ను ఆటో నుంచి బయటకు లాగి విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. ఆపై కిరాతకంగా ఆయన తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు

మంటల నుంచి తప్పించుకోవడానికి ఖోకన్ చంద్ర దాస్ ప్రాణభయంతో రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. ఆయన ఆర్తనాదాలు విన్న స్థానికులు తక్షణమే అక్కడికి చేరుకున్నారు. జనాన్ని చూసి దుండగులు పారిపోగా, స్థానికులు బాధితుడిని చెరువులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. తొలుత ఆయనను శరియత్‌పూర్ సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఢాకాకు రిఫర్ చేశారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స

శరియత్‌పూర్ సదర్ ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యుడు నజ్రుల్ ఇస్లాం తెలిపిన వివరాల ప్రకారం.. ఖోకన్ చంద్ర దాస్ శరీరంపై విచక్షణారహితంగా దాడి జరిగిన గుర్తులు ఉన్నాయి. ముఖ్యంగా కడుపు భాగంలో పదునైన ఆయుధంతో చేసిన తీవ్ర గాయాన్ని గుర్తించారు. వీటితో పాటు ముఖం, తల, చేతులు తీవ్రంగా కాలిపోయాయని, ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

బాధితుడి సతీమణి సీమా దాస్ కన్నీరుమున్నీరవుతూ మాట్లాడుతూ.. “నా భర్తను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో మాకు అర్థం కావడం లేదు. అయితే, దాడి చేస్తున్న సమయంలో నిందితుల్లో ఇద్దరిని ఆయన గుర్తుపట్టారు. తమ ఆచూకీ ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే వారు ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారని అనిపిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరు అనుమానితుల గుర్తింపు

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, రబ్బీ, సోహాగ్ అనే ఇద్దరిని ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు దముద్య పోలీస్ స్టేషన్ ఓసీ మహమ్మద్ రబీయుల్ హక్ తెలిపారు. “దాడిలో పాల్గొన్న వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇతరుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది” అని ఆయన చెప్పారు.

వరుస హత్యలతో వణుకుతున్న మైనారిటీలు

బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. గత నెలలో దీపూ చంద్ర దాస్ అనే యువకుడిని దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని వేలాడదీసి నిప్పు పెట్టారు. అలాగే అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్ వంటి వారు కూడా వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. వరుసగా జరుగుతున్న ఈ దాడులతో అక్కడి హిందూ మైనారిటీలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి..పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు - Tholi Paluku