Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు.. భారీ భద్రత మధ్య పోలింగ్‌

బంగ్లాదేశ్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు.. భారీ భద్రత మధ్య పోలింగ్‌

Shaik Mohammad Shaffee
12 ఫిబ్రవరి, 2026

బంగ్లాదేశ్ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమవబోతోంది. షేక్ హసీనా 15 ఏళ్ల సుదీర్ఘ నిరంకుశ పాలన కుప్పకూలి, మధ్యంతర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 18 నెలల తర్వాత దేశం తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. ఇవాళ (గురువారం) ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలతో పాటు దేశ భవిష్యత్తును నిర్ణయించే 84 అంశాల సంస్కరణలపై కూడా ప్రజలు తమ తీర్పును (రెఫరెండం) ఇవ్వనున్నారు.

రికార్డు స్థాయిలో భద్రత.. 10 లక్షల మందితో పహారా

ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 9 లక్షల మంది పోలీసు, అన్సార్ దళాలు కాగా, లక్ష మందికి పైగా సైనిక బలగాలు క్షేత్రస్థాయిలో పహారా కాస్తున్నాయి. తొలిసారిగా భద్రత కోసం డ్రోన్లు, 25,000 బాడీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. సుమారు 90 శాతం పోలింగ్ కేంద్రాలను సీసీటీవీల నిఘాలో ఉంచారు.

బరిలో లేని ఆవామీ లీగ్.. ద్విముఖ పోరు ఖాయం!

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీని నిషేధించడంతో, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ జాడ లేకుండా పోయింది. దీంతో పోటీ ప్రధానంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), దాని మాజీ మిత్రపక్షం జమాతే ఇస్లామీ మధ్యే నెలకొంది. మొత్తం 299 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది (ఒక అభ్యర్థి మరణంతో ఒక చోట ఎన్నిక వాయిదా పడింది). 50 రాజకీయ పార్టీల నుంచి 1,755 మంది అభ్యర్థులు, 273 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. బీఎన్‌పీ అత్యధికంగా 291 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. బరిలో కేవలం 83 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఉండటం గమనార్హం.

ఓటర్ల లెక్కలివే.. తొలిసారి విదేశీ ఓటు!

దేశంలో మొత్తం 12.77 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో మొదటిసారి ఓటు వేస్తున్న యువత 3.58 శాతంగా ఉంది. ఈసారి ఎన్నికల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. విదేశాల్లో ఉంటున్న సుమారు 8 లక్షల మంది ప్రవాస బంగ్లాదేశీయులకు ఐటీ ఆధారిత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే 5.15 లక్షల మంది విదేశీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం.

ఢాకాలో 'హై అలర్ట్'.. రిస్కీ కేంద్రాల గుర్తింపు

రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని 2,131 కేంద్రాల్లో 1,614 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న 43,000 కేంద్రాల్లో దాదాపు 24,000 కేంద్రాలు రిస్క్ జోన్‌లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఎన్నికల విధుల్లో 80 మంది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు, ఇద్దరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు మొబైల్ కోర్టుల ద్వారా పర్యవేక్షించనున్నారు.

జూలై నేషనల్ చార్టర్: ఏమిటిది?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం 'జూలై నేషనల్ చార్టర్'పై జరిగే రెఫరెండం. గత ఏడాది విద్యార్థుల పోరాటం అనంతరం రూపొందించిన ఈ చార్టర్‌లో 84 కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా ప్రధాని పదవికి గరిష్టంగా పదేళ్ల (రెండు విడతలు) కాలపరిమితిని విధించడం, పార్లమెంటులో కొత్తగా ఎగువ సభను (బైకామెరల్ సిస్టమ్) ఏర్పాటు చేయడం వంటి విప్లవాత్మక మార్పులు ఉన్నాయి. వీటితో పాటు న్యాయవ్యవస్థకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించడం, ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయడం, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా రిజర్వేషన్ల పెంపును ప్రతిపాదించారు. ఈ మౌలిక మార్పులపై ఓటర్లు తమ అంగీకారాన్ని లేదా నిరసనను 'అవును' లేదా 'కాదు' అనే ఓటు ద్వారా తేల్చనున్నారు.

అంతర్జాతీయ నిఘా.. మహిళా భద్రతపై ఆందోళన

ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి 45 దేశాల నుంచి సుమారు 400 మంది అంతర్జాతీయ పరిశీలకులు, 200 మంది విదేశీ జర్నలిస్టులు తరలివచ్చారు. మరోవైపు మహిళా అభ్యర్థులపై పెరుగుతున్న సైబర్ దాడులు, వేధింపులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, మైనారిటీలు నిర్భయంగా ఓటు వేసేలా చూడాలని అధికారులను కోరింది. ఇవాళ సాయంత్రం కల్లా పోలింగ్ ముగియనుండగా, ఫలితాలు శుక్రవారం (ఫిబ్రవరి 13) వెలువడే అవకాశం ఉంది.