
బంగ్లాదేశ్‌లో దొంగతనం నెపంతో హిందూ యువకుడిపై దాడి
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా మిథున్ సర్కార్ (25) అనే ఒక హిందూ యువకుడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. దొంగతనం చేశాడనే అనుమానంతో కొంతమంది దుండగులు అతడిని వెంబడించగా, వారి నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి నీటిలో దూకి, చివరకు ఊపిరి ఆడక మరణించాడు.
అసలేం జరిగింది?
బంగ్లాదేశ్ ఉత్తర జిల్లా అయిన నౌగావ్‌లోని మోహదేవ్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మహాదేవ్‌పూర్ మండలంలోని భండార్‌పూర్ గ్రామానికి చెందిన మిథున్ సర్కార్, ఆదివారం మధ్యాహ్నం చక్రగౌరి బజార్ ప్రాంతంలో ఉన్నాడు. ఆ సమయంలో మిథున్ ఎవరో డబ్బులు లాక్కున్నాడని (స్నాచింగ్) ఆరోపిస్తూ కొంతమంది స్థానిక యువకులు అతడిని పట్టుకోవడానికి వెంటాడారు. వారి నుంచి తప్పించుకోవడానికి మిథున్ పరుగులు తీస్తూ సమీపంలోని ఒక కాలువలోకి దూకాడు. అయితే నీటిలోకి వెళ్లిన కొద్దిసేపటికే అతడు కనిపించకుండా పోయాడు.
రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహం
మిథున్ కాలువలో మునిగిపోయిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రాజ్‌షాహి నుంచి ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాన్ని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల పాటు గాలించిన తర్వాత, మంగళవారం మధ్యాహ్నం కాలువలో మిథున్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
పోలీసుల విచారణ
ఈ ఘటనపై నౌహటా పోలీస్ అవుట్‌పోస్ట్ అధికారి గులాం ముస్తఫా స్పందిస్తూ.. మిథున్ మృతికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నామని తెలిపారు. కేవలం అనుమానంతోనే అతడిని వెంటాడారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మహాదేవ్‌పూర్ ప్రాంతంలో హిందూ కుటుంబాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పెరుగుతున్న హింస - ఆందోళనలో మైనారిటీలు
బంగ్లాదేశ్‌లో త్వరలో జరగనున్న 13వ జాతీయ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మతపరమైన దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. 'బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్' అందించిన నివేదిక ప్రకారం, ఒక్క డిసెంబర్ నెలలోనే 51 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. వీటిలో 10 హత్యలు, అనేక చోట్ల ఇళ్లు, భూముల కబ్జాలు, ఆలయాలపై దాడులు వంటివి ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వరుసగా జరుగుతున్న దాడులు
కేవలం మిథున్ సర్కార్ ఘటనే కాకుండా, గత వారం రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. జనవరి 2న లక్ష్మీపూర్‌లో ఒక హిందూ రైతుకు చెందిన వరి పొలాన్ని నిలువునా తగలబెట్టగా, మరుసటి రోజే షరియత్పూర్‌లో ఖోకాన్ చంద్ర దాస్ అనే వ్యాపారిపై దుండగులు మూక దాడి చేసి, అత్యంత కిరాతకంగా నరికి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అదే రోజున చటోగ్రామ్, కుమిల్లా ప్రాంతాల్లో సాయుధ ముఠాలు హిందూ కుటుంబాలను బందీలుగా చేసి, వారి వద్ద ఉన్న బంగారం, నగదును దోచుకున్నాయి. కాగా తమను భారత ఏజెంట్లని, మత విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ మైనారిటీలను వేధిస్తున్నారని ఐక్య పరిషత్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ దాడులు మరింత పెరగవచ్చని హిందూ సమాజం భయాందోళన వ్యక్తం చేస్తోంది.
