Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో జనవరి 22 నుంచి ఎన్నికల ప్రచారం

బంగ్లాదేశ్‌లో జనవరి 22 నుంచి ఎన్నికల ప్రచారం

Shaik Mohammad Shaffee
15 జనవరి, 2026

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఫిబ్రవరి 12న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అధికారిక ప్రచార పర్వం జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే దిశగా ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నారు.

తేదీ మార్పు ఉండదు: యూనస్ స్పష్టత

ఎన్నికల తేదీపై జరుగుతున్న ప్రచారాన్ని మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ కొట్టిపారేశారు. "ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్నికలు ఫిబ్రవరి 12నే జరుగుతాయి. ఒక్క రోజు ముందు కానీ, వెనుక కానీ మార్పు ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి తనను కలిసిన అమెరికా మాజీ దౌత్యవేత్తలతో చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల చుట్టూ అసత్య వార్తలు సృష్టించి గందరగోళం కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

సైన్యం పహారా.. కట్టుదిట్టమైన భద్రత

బంగ్లాదేశ్‌లో ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఆర్మీ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలను కట్టబెట్టింది. రంగంలోకి దిగిన సైన్యం అన్ని కీలక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిశితంగా తనిఖీలు నిర్వహిస్తోంది. మరోవైపు పోలీసు బలగాలను ‘స్పెషల్ అలర్ట్’లో ఉంచడంతో పాటు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను రెట్టింపు చేస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ముఖ్యమైన తేదీలు ఇవే

బంగ్లాదేశ్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 21న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసి, వారికి ఎన్నికల గుర్తులను కేటాయించనున్నారు. తర్వాతి రోజైన జనవరి 22 నుంచి అభ్యర్థులు అధికారికంగా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించవచ్చు. ఈ ప్రచార పర్వం ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 7.30 గంటల వరకు కొనసాగుతుంది, ఆ సమయంతో ప్రచార గడువు ముగుస్తుంది. ఇక అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 12న ఉదయం 7.30 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4.30 గంటల వరకు సాగుతుంది.

ఎన్నికలతో పాటే ‘రిఫరెండం’

ఫిబ్రవరి 12న కేవలం ఎన్నికలే కాకుండా, దేశ సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించనున్నారు. దేశంలో మళ్లీ నిరంకుశ పాలన రాకుండా ఉండేందుకు రూపొందించిన ‘జులై చార్టర్’కు ప్రజల ఆమోదం కోరనున్నారు. ఈ చార్టర్ దేశంలో నూతన ప్రజాస్వామ్య యుగానికి నాంది పలుకుతుందని యూనస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వీసా సేవలు నిలిపివేత

ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నెల రోజుల పాటు ‘ఆన్-అరైవల్ వీసా’ సదుపాయాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. భూటాన్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు గతంలో ఉన్న ఈ సదుపాయాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయా దేశాలకు సమాచారం పంపింది. భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయాల్లో కూడా వీసా ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.