Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులు: కేంద్రానికి సీఎం చంద్రబాబు అత్యవసర లేఖ

బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులు: కేంద్రానికి సీఎం చంద్రబాబు అత్యవసర లేఖ

Dantu Vijaya Lakshmi Prasanna
30 జనవరి, 2026

బంగ్లాదేశ్ నౌకాదళం అదుపులో ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించారు. ఈ మేరకు మత్స్యకారుల విడుదలకు అవసరమైన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఒక లేఖ రాశారు. కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి, మానవతా దృక్పథంతో వారిని త్వరగా విడుదల చేసేలా ఒత్తిడి తీసుకురావాలని సీఎం కోరారు.

పొరపాటున సరిహద్దులు దాటి.. బంగ్లాదేశ్ నేవీకి చిక్కిన వైనం

మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌కు చెందిన 'INDAP-V5-MM-75' రిజిస్ట్రేషన్ నంబర్ గల మెకానైజ్డ్ బోటు అక్టోబర్ 13, 2025న సముద్రంలో వేటకు వెళ్లింది. అయితే, సముద్రపు పోటు, వాతావరణ మార్పుల కారణంగా మత్స్యకారులు దారి తప్పి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో బంగ్లాదేశ్ నౌకాదళం వీరిని అదుపులోకి తీసుకుంది. అక్టోబర్ 22న తోటి మత్స్యకారుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా తమ వారు తిరిగి రాకపోవడంతో విజయనగరం జిల్లాకు చెందిన బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.

పరస్పర విడుదల ప్రక్రియపై ఆశలు

ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. కేంద్ర విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది, పశ్చిమ బెంగాల్‌లో 122 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు భారత అధికారుల నిర్బంధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మత్స్యకారుల 'పరస్పర విడుదల' ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని, మత్స్యకారులను వారి పడవతో సహా క్షేమంగా తిరిగి తీసుకువచ్చే వరకు ప్రభుత్వం విశ్రమించదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

సముద్రంలో స్పష్టమైన సరిహద్దు గుర్తులు లేకపోవడం, అకస్మాత్తుగా వచ్చే వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మత్స్యకారులు తరచుగా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి బంగ్లాదేశ్ నౌకాదళానికి చిక్కుతున్నారు. ముఖ్యంగా 2024 చివరలో బంగ్లాదేశ్‌లో తలెత్తిన రాజకీయ అస్థిరత తర్వాత సరిహద్దుల్లో నిఘా పెరగడంతో, అక్టోబర్, నవంబర్ నెలల్లో సుమారు 100 మందికి పైగా భారతీయ మత్స్యకారులు అరెస్టయ్యారు. గతంలో 2023లో కూడా దౌత్యపరమైన చర్చల ద్వారా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జైళ్ల నుండి పలువురు ఏపీ మత్స్యకారులు విడుదలైన దాఖలాలు ఉన్నాయి.

అలాగే బంగ్లాదేశ్ జలాల్లో పొరపాటున ప్రవేశించి, అక్టోబర్ 2025 నుండి బాగర్‌హాట్ జైలులో నిర్బంధంలో ఉన్న 23 మంది భారతీయ జాలర్లు (ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్) సముద్రంలో దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ కు చిక్కారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వారిని అరెస్ట్ చేసి బాగర్‌హాట్ జైలుకు తరలించింది. జనవరి 20, 2026న కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. జనవరి 25న విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 29న మోంగ్లా పోర్ట్ వద్ద భారత కోస్ట్ గార్డ్ కు అప్పగిస్తామన్నారు. డిసెంబర్ 7, 2025న ఇదే జైలు నుండి 47 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ 9 మంది వీరిలో ఉన్నారా లేరా అన్నది సందిగ్ధంగా ఉండడంతో ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఈ లేఖ రాసింది.

సాధారణంగా ఇరు దేశాల మధ్య ఉన్న 'కాన్సులర్ యాక్సెస్' ఒప్పందం ప్రకారం, మానవతా దృక్పథంతో ఇరు దేశాలు తమ వద్ద ఉన్న మత్స్యకారులను పరస్పరం మార్చుకుంటూ సమస్యను పరిష్కరిస్తుంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి లేఖ రాయడం వల్ల ఈ 9 మంది విడుదల ప్రక్రియ కూడా దౌత్యపరంగా మరింత వేగవంతం కానుంది.