Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేళ దారుణం: మరో బీఎన్‌పీ నేత కాల్చివేత

బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేళ దారుణం: మరో బీఎన్‌పీ నేత కాల్చివేత

Shaik Mohammad Shaffee
9 జనవరి, 2026

బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస మరోసారి భయాందోళనలు రేకెత్తిస్తోంది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకులు దారుణ హత్యకు గురయ్యారు. జనవరి 3న జషోర్ నగరంలో వార్డు-7 మాజీ సంయుక్త జనరల్ సెక్రటరీ ఆలంగీర్ హుస్సేన్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన మరవకముందే, బుధవారం రాత్రి రాజధాని ఢాకాలోని కర్వాన్ బజార్ ప్రాంతంలో బీఎన్‌పీ సీనియర్ నేత అజీజుర్ రెహమాన్ ముసబ్బిర్‌పై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముసబ్బిర్ ప్రాణాలు కోల్పోగా, ఆయనతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ముసబ్బిర్ బీఎన్‌పీకి చెందిన స్వచ్ఛంద సేవా విభాగం ‘స్వెచ్చాసెబక్ దళ్’లో ఢాకా సిటీ నార్త్‌కు మాజీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. బుధవారం రాత్రి సుమారు 8.40 గంటల సమయంలో బషుందర మార్కెట్ వెనుక ఉన్న తేజ్టూరీ బజార్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో ముసబ్బిర్ అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు ఏమన్నారంటే..

ఈ ఘటనను ఢాకా పోలీసు అధికారులు ధ్రువీకరించారు. తేజ్గావ్ డివిజన్‌కు చెందిన అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఫజ్లుల్ కరీం మాట్లాడుతూ, స్టార్ కబాబ్ రెస్టారెంట్ పక్కనున్న ఒక సందులో ఇద్దరిపై కాల్పులు జరిగాయని తెలిపారు. అందులో ముసబ్బిర్ మృతి చెందగా, మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కాల్పులు జరిపిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

కాల్పుల సమయంలో ముసబ్బిర్‌తో పాటు కర్వాన్ బజార్ వ్యాన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబూ సుఫియాన్ మసూద్ కూడా ఉన్నారు. మసూద్ పొత్తికడుపు ఎడమ వైపున తూటా తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ముసబ్బిర్ సాయంత్రం సూపర్ స్టార్ హోటల్ సమీపంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిశాక ఆయన మసూద్‌తో కలిసి సమీప వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్‌సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ముసబ్బిర్‌ను ముందుగా బీఆర్‌బీ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

ముసబ్బిర్ నేపథ్యం

ముసబ్బిర్ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ, గత అవామీ లీగ్ పాలనలో ఆయనపై అనేక రాజకీయ కేసులు పెట్టారని, ఆ సమయంలో చాలాకాలం జైల్లో గడిపారని తెలిపారు. ఆయన షరీయత్పూర్ జిల్లా వాసి కాగా, ముగ్గురు సోదరుల్లో పెద్దవాడు. ఢాకాలోని వెస్ట్ కర్వాన్ బజార్‌లో గార్డెన్ రోడ్డులో తన కుటుంబంతో కలిసి నివసించేవారు. 2020లో జరిగిన సిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో తేజ్గావ్ వార్డ్-26 నుంచి బీఎన్‌పీ మద్దతుతో కౌన్సిలర్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.

ఆందోళనలో ప్రజలు

ఈ హత్యకు నిరసనగా బీఎన్‌పీ కార్యకర్తలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి, సోనార్‌గావ్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దేశంలో ఫిబ్రవరి 12న జాతీయ ఎన్నికలు జరగనున్న తరుణంలో, ఈ దారుణం జరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస పెరిగిపోతుండటంపై అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేళ దారుణం: మరో బీఎన్‌పీ నేత కాల్చివేత - Tholi Paluku