Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. మూతపడుతున్న పెట్రోల్ బంకులు!

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. మూతపడుతున్న పెట్రోల్ బంకులు!

Shaik Mohammad Shaffee
25 మార్చి, 2026

బంగ్లాదేశ్‌ను తీవ్ర ఇంధన సంక్షోభం చుట్టుముట్టింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల అక్కడి నుంచి రావలసిన పెట్రోల్, ఆక్టేన్ సరఫరా ఆగిపోయింది. దీనివల్ల రాజధాని ఢాకాతో పాటు దేశమంతటా పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోయి బోర్డులు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) తగినంత ఇంధనాన్ని పంపలేకపోతుండటంతో, వాహనదారులు పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నానా అవస్థలు పడుతున్నారు.

చెల్లింపుల జాప్యంతో నిలిచిన సరఫరా

ఢాకాలోని రద్దీ ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులు సైతం మంగళవారం మధ్యాహ్నం నుంచి కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇంధన నిల్వల కోసం బ్యాంకుల ద్వారా జరగాల్సిన చెల్లింపులు సకాలంలో పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. "బ్యాంకులు మూసి ఉన్న సమయంలో చెల్లింపులు చేయాల్సి రావడంతో జాప్యం జరిగింది. నిధులు జమ చేసినప్పటికీ, ఇంధనం ఇంకా మాకు చేరలేదు. స్టాక్ వస్తే తప్ప బంకులను తెరవలేం" అని ఒక స్టేషన్ మేనేజర్ వెల్లడించారు. పెట్రోల్, ఆక్టేన్ లభ్యత లేకపోవడంతో వేలాది మంది ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు

సరఫరా కొరత వల్ల బంకుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్న వాహనదారులు అసహనంతో ఊగిపోతున్నారు. పలు చోట్ల పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో అల్లరి మూకలు గుంపులుగా వచ్చి పెట్రోల్ బంకులను తెరవాలని బెదిరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఇంధనాన్ని తీసుకువెళ్తున్నారని బంకు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఠాకూర్‌గావ్ వంటి ప్రాంతాల్లో కర్రలతో వచ్చిన ఆందోళనకారులు బంకులను ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి. లైసెన్సులు లేని వాహనదారులు సైతం బంకులను తగలబెడతామని హెచ్చరిస్తున్నారని యజమానుల సంఘం పేర్కొంది.

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

ప్రస్తుత సంక్షోభంపై బంగ్లాదేశ్ పెట్రోల్ పంప్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, క్షేత్రస్థాయిలో భద్రత కల్పించడంలో విఫలమైందని మండిపడింది. "కేవలం కాగితాల మీద నివేదికలు తయారు చేయడంపైనే అధికారులు దృష్టి పెట్టారు తప్ప, బంకులకు కనీస రక్షణ కల్పించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశవ్యాప్తంగా బంకులను మూసివేయక తప్పదు" అని అసోసియేషన్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. డిపోల నుంచి 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంకులకు ఇంధన ట్యాంకర్లు సురక్షితంగా చేరుతాయనే గ్యారెంటీ లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారిలో ట్యాంకర్లను లూటీ చేసే ప్రమాదం ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.