Let's talk: editor@tmv.in
బంగాళాదుంప రైతులకు న్యాయం చేయాలి: సమాజ్‌వాదీ పార్టీ

బంగాళాదుంప రైతులకు న్యాయం చేయాలి: సమాజ్‌వాదీ పార్టీ

Pinjari Chand
11 మార్చి, 2026

బంగాళాదుంప రైతులకు న్యాయమైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు మంగళవారం పార్లమెంట్‌ ప్రాంగణం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. పార్టీ ఎంపీలు బంగాళాదుంపలను చేతబట్టి నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నిరసనకు ఎంపీ డింపుల్ యాదవ్‌ నాయకత్వం వహించారు. ‘ఆలూ కా ఉచిత్ ముల్య దిలావో, కిసానో కో యూన్ న సతావో’ (బంగాళాదుంపలకు సరైన ధర ఇవ్వండి, రైతులను ఇబ్బంది పెట్టొద్దు) అనే నినాదాలతో ఉన్న బ్యానర్లతో ఎంపీలు ఆందోళన చేపట్టారు.

ఇదిలా ఉండగా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ క్రిష్‌యోన్నతి యోజన పునర్వ్యవస్థీకరణ, ప్రధానమంత్రి ధన్, ధాన్య కృషి యోజన వంటి పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే ఈ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల సంఘంపై ‘వోట్‌ చోరీ’ ఆరోపణలు చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్‌సభ సమావేశాలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఇక లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై కూడా ప్రతిపక్షం సిద్ధమవుతోంది. స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 118 మంది ప్రతిపక్ష ఎంపీలు తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్‌ ఎంపీ కే.సురేశ్ తెలిపారు.

కనీసం కిలోకు రూ.10 ధర ఇవ్వాలని డిమాండ్

దేశంలోని అనేక వ్యవసాయ మార్కెట్లలో బంగాళాదుంప (ఆలు) ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పలుచోట్ల రైతులకు లభిస్తున్న ధర ఉత్పత్తి ఖర్చుకంటే కూడా తక్కువగా ఉండటంతో నష్టాలు ఎదురవుతున్నాయని రైతు సంఘాలు చెబుతున్నాయి. తాజా మార్కెట్‌ వివరాల ప్రకారం, దేశంలోని కొన్ని ప్రధాన మండీల్లో బంగాళాదుంపల హోల్‌సేల్‌ ధరలు క్వింటాల్‌కు సుమారు రూ.220 నుంచి రూ.980 మధ్య ఉన్నాయి. అంటే కిలోకు సుమారు రూ.2 నుంచి రూ.10 వరకు మాత్రమే రైతులకు లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ధరలు మరింతగా పడిపోయాయి. పశ్చిమ బెంగాల్‌లో అధిక ఉత్పత్తి కారణంగా రైతులు కిలోకు కేవలం రూ.4–రూ.5కే బంగాళాదుంపలు అమ్మాల్సి వస్తోంది. అయితే నగరాల్లో వినియోగదారులు మాత్రం కిలోకు రూ.14–రూ.19 వరకు చెల్లిస్తున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కిలోకు రూ.30 ఇస్తున్నారు. వ్యవసాయ నిపుణుల ప్రకారం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు అధిక ఉత్పత్తి, కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయాల కొరత, మార్కెట్లో సరఫరా అధికం కావడం. పంట ఎక్కువగా రావడంతో రైతులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో తక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కనీసం కిలోకు రూ.10 ధర లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని బేస్‌ ధరను పెంచాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

బంగాళాదుంప రైతులకు న్యాయం చేయాలి: సమాజ్‌వాదీ పార్టీ - Tholi Paluku