
బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జి పైనుంచే
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పర్యాటక రంగం మరింత ఊపందుకునేందుకు సిద్ధమైంది. విశాఖలోని ప్రముఖ ఐకానిక్ ల్యాండ్‌మార్క్ అయిన కైలాసగిరి కొండలపై భారతదేశంలోనే అతి పొడవైన అత్యాధునిక 50 మీటర్ల గాజు వంతెన డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇకపై బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలను ఆకాశం నుంచి ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన, ఇది కేరళ 40 మీటర్ల గాజు వంతెన రికార్డును బ్రేక్ చేసింది. ఈ గాజు వంతెన సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించారు. ఆహ్లాదకరమైన ఈ గాజు వంతెనను సోమవారం ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ ఇకపై రాత్రివేళ త్రివర్ణ లైటింగ్ తో మెరిసిపోనుంది.
ఈ సందర్భంగా వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యాటకాభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. విశాఖపట్టణాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సహజ విపత్తులు సంభవించినా భద్రంగా నిలబడేలా గ్లాస్ బ్రిడ్జిని అత్యంత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందించామని చెప్పారు.
భవిష్యత్తులో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు
సమీప భవిష్యత్తులో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఎంపీ శ్రీభరత్ ప్రకటించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 40 ఎంఎం మందం ఉన్న ల్యామినేటెడ్ గాజును ఉపయోగించగా, ఈ గాజును జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. ఒకేసారి సుమారు 500 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఇందులో ఉంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు కూడా ఇది స్థిరంగా తట్టుకునేలా దీన్ని రూపొందించారు. అంతేకాకుండా ఒక సమయంలో 40 మంది పర్యాటకులు ఈ బ్రిడ్జిపైకి వెళ్లి కైలాసగిరి చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే అవకాశం కల్పించారన్నారు.
