Let's talk: editor@tmv.in
బంగారు ఆభ‌ర‌ణాల అమ్మ‌కంలో వృద్ధి

బంగారు ఆభ‌ర‌ణాల అమ్మ‌కంలో వృద్ధి

FL - BRTH
9 అక్టోబర్, 2025

బంగారం ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ ప్ర‌ముఖ ఆభ‌ర‌ణాల త‌యారీ కంపెనీలు సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని న‌మోదు చేశాయి. దీనికి వివాహాలు, పండుగ సీజ‌న్ల డిమాండ్ ప్ర‌ధాన కార‌ణంగా నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ప్రముఖ జ్యుయ‌ల‌రీ సంస్థ టైటాన్ వ్యాపారం గ‌త ఏడాదితో పోల్చితే 20 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో 55 స్టోర్ల‌ను ప్రారంభించింది. రిటైల్ జ్యుయ‌ల‌రీ విభాగంలో టైటాన్ సంస్థ త‌న ఉనికిని చాటుకుంది. పెరిగిన 55 స్టోర్ల‌తో టైటాన్ నెట్ వ‌ర్క్ 3377 అవుట్ లెట్ల‌కు చేరింది. దేశీయ వ్యాపారం 19శాతం పెర‌గ‌గా, ఆప‌రేష‌న్స్ 18 శాతం పెరిగాయి.

క‌ల్యాణ్ జువెల‌ర్స్ ఆదాయం 30 శాతం వృద్ధిని న‌మోదు చేసింది. గ‌త ఏడాదితో పోల్చితే భార‌త వ్యాపార కార్య‌క‌లాపాలు 31 శాతం పెరిగాయి. స్టోర్ అమ్మ‌కాలు 16 శాతం, అంత‌ర్జాతీయ ఆదాయం 17 శాతం పెరిగింది. మిడిల్ ఈస్ట్ ఆదాయం 10 శాతం పెరిగింది. కంపెనీ డిజిట‌ల్ ప్లాట్ఫామ్ కాండ‌రె 127 శాతం వృద్ధిని న‌మోదు చేసింది. భార‌త్ లో 15 షోరూమ్ ల‌ను, మిడిల్ ఈస్ట్ లో 2 షోరూమ్ ల‌ను, 15 కాండ‌రె అవుట్ లెట్ల‌ను క‌ల్యాణ్ జువెల‌ర్స్ ప్రారంభించింది.

పీసీ జువెల‌ర్స్ ఆదాయం 63 శాతం పెరిగింది. ఢిల్లీలో కొత్త ప్రాంచైజ్ షోరూమ్ ప్రారంభించింది. పీఎన్ గాడ్గిల్ జువెల‌ర్స్ సంస్థ రికార్డు అమ్మ‌కాలు న‌మోదు చేసింది. గ‌త ఏడాది కంటే 65 శాతం వృద్ధిని సాధించింది. న‌వ‌రాత్రి అమ్మ‌కాలు 66 శాతం పెరిగి రూ. 428 కోట్ల ఆదాయం ఆర్జించింది. ద‌స‌రా ఒక్క రోజే అమ్మ‌కాలు 64శాతం పెరిగి రూ.190 కోట్ల ఆదాయం ఆర్జించింది. వివాహాలు, సీజ‌న్, పండుగ‌ల సీజ‌న్ వ్యాపారంలో వృద్ధికి కార‌ణ‌మ‌ని నిపుణులు భావిస్తున్నారు. అంత‌ర్జాతీయంగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు కంపెనీల‌ను భ‌య‌పెట్టిన‌ప్ప‌టికీ, వివాహాలు, పండుగ సీజ‌న్లు రావ‌డంతో వ్యాపార వృద్ధిని న‌మోదు చేయ‌గ‌లిగాయి. లేదంటే కొంత ఇబ్బందిని ఎదుర్కొవ‌ల‌సిన ప‌రిస్థితి ఉండేద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బంగారు ఆభ‌ర‌ణాల అమ్మ‌కంలో వృద్ధి - Tholi Paluku