
బంగారం సంపదను సృష్టించాలి
భారతదేశంలో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అయినా పండుగలు, పెళ్లిళ్ల సందర్బంగా వినియోగదారులు ఇప్పటికీ ఆభరణాల దుకాణాలకు తరలివెళ్తున్నారు. అనేక కుటుంబాలకు పెరుగుతున్న ధర అడ్డంకి కాదు. ఎందుకంటే బంగారం ఎల్లప్పుడూ సురక్షిత ఆస్తి అని ప్రజలు బాగా నమ్ముతారు. అయితే ఈ పసిడి పట్ల అంతులేని ప్రేమ వెనుక లోతైన ఆర్థిక కారణం దాగి ఉంది. వ్యక్తిగత సంపదను కాపాడుతూనే అది సమాజ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని చూపుతుంది .
చరిత్రలో బంగారం
ప్రపంచంలోని నాగరికతలు బంగారాన్ని పవిత్రమైనది, చిరస్థాయిగా ఉండేదిగా, నమ్మకమైన పెట్టుబడిగా అనుకునేలా మార్చేసాయి. ప్రాచీన ఈజిప్టు సమాధుల నుండి భారత ఆలయ నిధుల వరకు, రోమన్ నాణేల కాలం నుండి బ్రిటిష్ ఖజానాలు నింపే వరకు, బంగారం నిరంతరం ఒక భద్రతా శక్తిగా నిలిచింది. 20వ శతాబ్దంలో కరెన్సీ విలువకు బంగారం ఆధారం అనే సూత్రం లేనప్పటికీ, బంగారం ప్రజలను ఆర్దిక వెనుకబాటు నుండి కాపాడే వస్తువుగా మారి తన కీర్తిని నిలబెట్టుకుంది. భారతదేశంలో బంగారంపై మోజు ఈనాటిది కాదు.అది సాంస్కృతిక పరంగా వారి జీవన విదానంలో బాగంగా మారిపోయింది. ఆభరణాలు అలంకారం మాత్రమే కాకుండా వారసత్వం, ఆచార సంప్రదాయం, సామాజిక గౌరవప్రతిష్టకు హామీ ఇస్తాయి అనే భావన ప్రజల్లో బలంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం .
భారతీయులకు బంగారంపై ప్రత్యేక మోజు
భారతీయులలో బంగారం కొనుగోలు చేయడానికి పెట్టుబడి కారణాలకంటే ఎక్కువగా సంపద కూడపెట్టుకోవాలి అనే కోరికతో పాటు అందరికీ వారి గొప్పతనాన్ని,ధనబలాన్ని,ఆర్భాటాన్ని చూపించాలనే కుతూహలం కూడా కారణం. ఒక కుటుంబలో పెళ్లివేడుక జరిగితే ఆభరణాలు లేకుండా ఆ వివాహం అసంపూర్ణం అని అందరూ భావిస్తారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశి వంటి పండుగలు ప్రతి సంవత్సరం బంగారాన్ని మరింతగా కొనుగోలు చేయాలనే కోరికను పెంచుతున్నాయి. బ్యాంకులు తక్కువ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో బంగారం పొదుపు రూపంలో ఉపయోగపడుతుంది. పట్టణ పెట్టుబడిదారులకైతే ఇది ఆర్దిక అసమతుల్యత , స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నుండి బయట పడేందుకు రక్షణ కవచంగా ఉంటున్నది. ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా నగదుగా మార్చుకోవచ్చు అనే విషయం బంగారాన్ని మరింతగా కొనుగోలుచేసే దిశగా వినియోగదారుల్ని ప్రోత్సాహిస్తున్నది. వ్యక్తిగత స్థాయిలో బంగారం ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది సంపదను కాపాడుతుంది, ఆర్దిక భద్రతను ఇస్తుంది, సమాజంలో వారికి సామాజిక గౌరవాన్ని కలిగిస్తుంది.
సామాజిక – ఆర్థిక ప్రభావం
భారతదేశంలో అతిపెద్ద ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగ్గా ఉన్న రంగం ఆభరణ పరిశ్రమ. అయితే మరోవైపు ప్రతికూలత కూడా దాగి ఉంది. భారతదేశం సంవత్సరానికి 800 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇలా ఇతర దేశాలపై అధికంగా ఆధారపడటం వలన విదేశీ మారక ద్రవ్య లోటు ఏర్పడుతుంది . రూపాయిని బలహీనపరుస్తుంది, బంగారం కొనుగోలు కుటుంబ పొదుపులను ఈక్విటీలు, బాండ్లు, మౌలిక సదుపాయాల వంటి ఉత్పాదక మార్గాల నుండి మళ్లిస్తుంది. వ్యక్తికి సురక్షితమని అనిపించేది దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం భారంగా మారుతుంది.
ప్రయోజనాలు- నష్టాలు
బంగారం ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఇది ప్రపంచ వ్యాప్తంగా నిధుల నిల్వ, ఆర్దిక ముప్పుల నుండి దేశానికి భద్రత కలిగిస్తుంది . ద్రవ్యోల్బణం లేదా ఆర్దిక అసమతుల్యత లాంటి ఉద్రిక్తతల సమయంలో బాగా పనిచేస్తుంది. ఇది తేలికైనది , శాశ్వతమైనది. కానీ ఇందులోనూ కొన్ని నష్టాలు కూడా దాగి ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ లో ధరల అస్థిరత చిన్న కొనుగోలుదారులను ఆర్దికంగా దెబ్బ తీస్తుంది . అధిక దిగుమతులు విదేశీ మారక నిల్వలను ఖాళీ చేస్తాయి, బంగారం నిల్వలు ఆర్థిక వ్యవస్థలో ధన ప్రవాహాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా, బంగారం ఉత్పాదక ఆస్తి కాదు.
ధరల్ని నిర్ణయించే అంశాలు
బంగారం ధరలపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. ప్రపంచ వాణిజ్య మార్కెట్ లో ఒడిదుడుకులు పెట్టుబడిదారులను ఎప్పుడూ బంగారంవైపు నెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పులు ఇక్కడ కీలకంగా పనిచేస్తున్నాయి. వడ్డీ రేట్లు పడిపోతే బంగారం ఆకర్షణ పెరుగుతుంది. అమెరికన్ డాలర్ బలహీనత లేదా బలాన్ని బట్టి అంతర్జాతీయ ధరలు మారుతాయి. యుద్ధాలు, వాణిజ్య ఆంక్షలు వంటి అనుకోని సంక్షోభాలు వినియోగ దారునిలో ముందు జాగ్రత్తని పెంచుతాయి. భారతదేశంలో దిగుమతి సుంకాలు, పండుగల డిమాండ్, వర్షాలు ,పర్యావరణ ఫలితాలు వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి.
బంగారాన్ని మరింత ఉత్పాదకంగా మార్చడం
బంగారం యొక్క ద్వంద్వ స్వభావాన్ని గుర్తించిన విధాన నిర్ణేతలు,ఆర్దిక వేత్తలు దానిని ఉత్పాదక మార్గాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగారంపై వడ్డీ వచ్చే పధకాలలో పెట్టుబడి ద్వారా గృహాల్లో బీరువాల్లో ,లాకర్లలో ఉన్న ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే బ్యాంకులు వడ్డీ ఇస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్లు పెట్టుబడిదారులకు ధర పెరుగుదల లాభాన్ని ఇస్తూ, స్థిర వడ్డీని కూడా కలిగిస్తాయి. డిజిటల్ గోల్డ్(పేపర్ గోల్డ్ ) పత్రాలు చిన్న మొత్తాల పెట్టుబడులను అదుపులో ఉంచుతాయి. పాత ఆభరణాల మార్పిడి కూడా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే మార్గంగా చెప్పవచ్చు. కానీ ఈ పథకాల వినియోగం పరిమితంగానే ఉంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన లోపం, బంగారంపై భావోద్వేగ అనుబంధం, ఆర్థిక సంస్థలపై అవిశ్వాసం కారణంగా వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు మన ముందున్న సవాలు లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక సంప్రదాయాలను తగ్గించడం కాదు. వ్యక్తిగత భద్రత మరియు జాతీయ ఉత్పాదకత మధ్య సమతౌల్యం సాధించడం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తయారీ రంగం మౌలిక సదుపాయాల కల్పన లాంటి ఆవిష్కరణలకు మూలధనం అవసరం. బీరువాలు, లాకార్లలో బంధించబడిన బంగారు వస్తువులు ఈ ప్రయోజనాల కోసం ఉపయోగపడవు. ఉదాహరణకు సావరిన్ గోల్డ్ బాండ్లు మధ్యమార్గాన్ని అందిస్తాయి . మంచి ఆదాయాన్ని తీసుకొస్తాయి. ఈ పధకాలలో పెట్టుబడి పెడితే వినియోగదారులకు బంగారం ధర పెరుగుదల లాభం ఇస్తూనే వార్షిక వడ్డీని కూడా ఇస్తుంది దిగుమతుల ద్వారా విదేశీ మారకం ఖర్చు చేయకుండా ఉపయోగపడుతుంది. .
బంగారం ఎల్లప్పుడూ భావోద్వేగ, ఆర్థిక విలువ కలిగి ఉంటుంది, భారతీయ సంస్కృతిలో దాని స్థానం ఎప్పటికీ తగ్గదు. కానీ ధరలు ఆకాశాన్ని అంటుతోంటే, ఆర్థిక వ్యయం పెరుగుతున్న వేళ, కుటుంబాలు బంగారపు వస్తువుల కొనుగోలు పై అధిక ఆధారాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. కనకపు మెరుపు మనల్ని అంధుల్ని చేయకూడదు . నిజమైన సంపద సృష్టి మన ఆర్దిక విలువను కాపాడటమే కాకుండా, ఆదాయం తెచ్చే, భవిష్యత్తును నిర్మించే పెట్టుబడుల్లో ఒకటిగా ఉండేలా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం.
