
బంగారం ధరల ఆకాశయానం
ఇండియాలో బంగారం అంటే ఒక సంపద మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్! పెళ్లిళ్లు, పండుగలు, పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశ.. ఇలా అన్నింటిలోనూ బంగారం ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలాలు మారుతున్నా బంగారం పట్ల భారతీయుల ప్రేమ మాత్రం ఏనాటికీ తగ్గదనే చెప్పాలి. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 88 రూపాయాల మాత్రమే ఉండేది. కానీ, 2025 అక్టోబర్ మధ్య నాటికి అదే బంగారం లక్షా 30వేల రూపాయల మార్క్‌ను చేరుకుంది! ఈ పెరుగుదల వెనుక అనేక ఆర్థిక, రాజకీయ పరిణామాలు కారణంగా ఉన్నాయి.
78ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో 1974 ప్రధానమైనది. 1974లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ ధరల పెరుగుదలతో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1973లో 278 రూపాయలగా ఉన్న బంగారం అప్పుడు 506 రూపాయలకు చేరింది. ఇక 1991 ఆర్థిక సంస్కరణలు తర్వాత బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1991లో 3,466 రూపాయలగా ఉన్న బంగారం ధరలు 1992నాటికి 4,334 రూపాయలకు చేరాయి. ఇటు 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. భారతీయులు కూడా ఆ సంవత్సరంలో బంగారాన్ని భద్రంగా పెట్టుబడిగా మార్చుకున్నారు. 2007లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10వేల 800 రూపాయలగా ఉటే అది 2008 నాటికి 12,500 రూపాయలకు పెరిగింది. ఇక 2020లో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా, బంగారం విలువ మాత్రం పెరిగింది. భద్రత కోసం ప్రజలు బంగారం వైపుకే మొగ్గుచూపారు. 2019లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 35,220 రూపాయలు ఉండగా.. 2020 నాటికి ఏకంగా 48,651 రూపాయలకు పెరిగింది. ఇక ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా లేవు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ యుద్ధాలు, పెరిగిన డాలర్ విలువ కారణంగా బంగారం ధరను కొత్త గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. అందుకే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష మార్కును టచ్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా లక్షా 50వేల రూపాయల వైపు పరుగులు పెడుతోంది.
మరోవైపు ఈ పరుగు ఇప్పటితో ఆగేలా కనిపించడంలేదు. ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఆర్థిక అనిశ్చితులకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే టారిఫ్ వార్‌తో ప్రపంచ మార్కెట్‌ను షేక్ చేశారు ట్రంప్. ఆయన నిర్ణయాలకు తోడు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను కొనసాగిస్తే.. డాలరు మరింత బలహీన పడే అవకాశం ఉంది. అప్పుడు బంగారం ధర మరింత పెరుగుతుంది. ఇటు బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026 అంచనా ప్రకారం బంగారం ధర 5,000 డాలర్లకు చేరుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే ఇండియాలో గోల్డ్ ప్రైజ్ లక్షా 75వేలకు తాకొచ్చు. మరికొందరి నిపుణుల అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. రానున్న కాలంలో ఔన్స్ 6,600 డాలర్లకు చేరుకోవచ్చట. అప్పుడు భారత్‌లో తులం బంగారం అక్షరాలా రెండున్నర లక్షలకు దూసుకుపోయే అవకాశం ఉంది. వామ్మో తలుచుకుంటూనే భయం వేస్తుంది కదా..అసలు భవిష్యత్‌లో బంగారం కొనడం మధ్యతరగతి ప్రజలకు సాధ్యం కాదేమో!
