Let's talk: editor@tmv.in
బంకే బిహారి ఆలయంలో ప్రస్తుత ఆచారాల్లో మార్పులు ఉండవు: సుప్రీంకోర్టు

బంకే బిహారి ఆలయంలో ప్రస్తుత ఆచారాల్లో మార్పులు ఉండవు: సుప్రీంకోర్టు

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

వృందావన్‌లోని ప్రసిద్ధ బంకేబిహారి ఆలయంలో ప్రస్తుతం అమలులో ఉన్న మతాచారాలు, వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు చేయబోమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌, న్యాయమూర్తి జోయ్‌మాల్యబాగ్చీలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. తాజాగా సమర్పించిన స్టేటస్ రిపోర్టుకు సంబంధించి ఇరు పక్షాలు తమ కౌంటర్‌‌ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇచ్చి విచారణను వాయిదా వేసింది.

ఈ కేసును ఆలయ నిర్వహణ కమిటీతో పాటు పూజారులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు విచారిస్తోంది. కోర్టు నియమించిన హై పవర్డ్ కమిటీ తీసుకున్న కొన్ని పరిపాలనా నిర్ణయాలు ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న మతపరమైన సంప్రదాయాలకు భంగం కలిగించాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్‌ శ్రీ బంకే బిహరి ట్రస్ట్‌ ఆర్టినెన్స్‌ 2025లోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఆలయ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం 12 మంది సభ్యులతో కూడిన హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్‌‌ అధ్యక్షత వహిస్తున్నారు.

దర్శన సమయాల మార్పుపై అభ్యంతరం

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదిస్తూ స్టేటస్ రిపోర్ట్ ఆదివారం సాయంత్రం మాత్రమే అందిందని, స్పందించేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. అదే సమయంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం.నటరాజ్‌ మాట్లాడుతూ హై పవర్డ్ కమిటీ కోర్టు ఆదేశాల మేరకే పనిచేస్తుందని తెలిపారు.

పిటిషనర్ల ప్రధాన అభ్యంతరం ఆలయంలో దర్శన సమయాల మార్పు, కొన్ని సంప్రదాయ పూజలను నిలిపివేయడంపై ఉంది. ముఖ్యంగా ‘దేహరి పూజ’ వంటి ఆచారాలను నిలిపివేయడం సంప్రదాయాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.

సంప్రదాయాల ప్రాముఖ్యత

ఈ ఆలయంలో వేసవి, శీతాకాలాలకు వేర్వేరు దర్శన సమయాలు ఉండే సంప్రదాయం ఉందని పిటిషనర్లు తెలిపారు. దేవుడిని నిద్రలేపడం, విశ్రాంతి ఇవ్వడం వంటి అంతర్గత ఆచారాలతో ఈ సమయాలు అనుసంధానమై ఉంటాయని చెప్పారు. దేహరి పూజను గోస్వామీలు గురు–శిష్య పరంపరలో నిర్వహిస్తారని, అది ప్రజలకు తెరవని సమయంలోనే జరుగుతుందని పేర్కొన్నారు. కేవలం జనసందోహాన్ని కారణంగా చూపి దాన్ని నిలిపివేయడం సమంజసం కాదని వాదించారు.

గత విచారణలో కోర్టు వ్యాఖ్యలు

గత సంవత్సరం డిసెంబర్ 15న జరిగిన విచారణలో ప్రత్యేక పూజల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేయడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవతలకు విశ్రాంతి సమయం కూడా ఇవ్వకుండా డబ్బు చెల్లించిన వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

ఆలయ ట్రస్ట్‌పై వివాదం

2025లో జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆలయ నిర్వహణను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. దీంతో మత సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం పెరుగుతుందా అనే చర్చ ప్రారంభమైంది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతపై విచారణను అలహాబాద్ హైకోర్టు పరిశీలించాలని సుప్రీంకోర్టు అప్పట్లో పేర్కొంది. అయితే ఆర్డినెన్స్ అమలును తాత్కాలికంగా నిలిపివేసి ఆలయ దైనందిన నిర్వహణను హై పవర్డ్ కమిటీ పర్యవేక్షణలో కొనసాగించేందుకు ఆదేశించింది.