
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత్‌కు షాక్: రెండో రౌండ్‌లోనే అంతా అవుట్!
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత్ ప్రయాణం రెండో రౌండ్‌లోనే ముగిసింది. ఉన్నతి హూడా, రోహన్ కపూర్-రుత్విక గడ్డే, కవిప్రియా సెల్వం-సిమ్రాన్ సింఘి జోడీలు ఓటమి పాలయ్యాయి. 18 ఏళ్ల యువ సంచలనం ఉన్నతి హూడా మాత్రమే సింగిల్స్‌లో తొలి రౌండ్‌ను దాటిన ఏకైక భారత షట్లర్. గ్లేజ్ అరేనాలో చైనా ఆటగాడు వాంగ్ జియీ చేతిలో 21-14, 21-11 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ముందు 35వ ర్యాంకర్ ఉన్నతి 39 నిమిషాల్లోనే స్ట్రెయిట్ గేమ్స్‌లో ఓటమి పాలైంది.
మొదటి రౌండ్‌లో మలేషియా లెట్షనా కరుపతేవన్‌ను చిత్తు చేసిన ఉన్నతి, చైనా ఆటగాడితో మొదటి గేమ్‌లో 4-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వాంగ్ ఆ తర్వాత ఆధిపత్యం చెలాయించి మొదటి గేమ్ సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో ఉన్నతి మొదటి రెండు పాయింట్లు సాధించినా, వాంగ్ వరుసగా 11 పాయింట్లు గెలుచుకొని మ్యాచ్‌ను భారత యువతి చేతుల్లోంచి లాగేసుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-రుత్విక గడ్డే జోడీ ప్రపంచ చాంపియన్‌షిప్ బ్రాంజ్ మెడలిస్టులు థామ్ గిక్వెల్, డెల్ఫిన్ డెల్రూతో గంట 15 నిమిషాలు పోరాడి 21-23, 8-21, 17-21 పాయింట్ల తేడాతో ఓడిపోయారు.
విమెన్స్ డబుల్స్‌లో కవిప్రియా సెల్వం-సిమ్రాన్ సింఘి జోడీ ప్రపంచ మూడో ర్యాంకర్లు కిమ్ హై జియాంగ్, కాంగ్ హీ యాంగ్ చేతిలో 34 నిమిషాల్లోనే 21-7, 21-9 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడారు.
అంతకుముందు టోర్నీలో ప్రసిద్ధ మెన్స్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి తొలి రౌండ్‌లోనే షాకింగ్ ఓటమి పాలయ్యారు. అన్‌సీడెడ్ ఇండోనేషియా జోడీ రహ్మత్ హిదయత్-ముహమ్మద్ ర్యాన్ అర్డియాంటోతో 42 నిమిషాల్లో 21-18, 22-20 పాయింట్ల తేడాతో ఓడారు. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్య సేన్ తొలి రౌండ్‌లోనే ఐర్లాండ్ ఆటగాడు అయిన నాట్ న్గుయెన్ చేతిలో స్ట్రెయిట్ గేమ్స్‌లో ఓడి ఫ్రెంచ్ ఓపెన్ 2025 నుంచి నిష్క్రమించారు.
