
‘ఫ్రీ సాండ్ పాలసీ’ అక్రమాలకు అడ్డాగా మారింది: వైసీపీ నేత
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్న ‘ఉచిత ఇసుక విధానం’ కేవలం అధికార పార్టీ నేతలు సహజ వనరులను దోచుకోవడానికి వేసుకున్న ముసుగు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె. గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉచితం పేరుతో ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఐదు రెట్లు అధిక ధరలకు ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ విధానం ఒక సంఘటిత కుంభకోణంలా మారిందని పాలక పక్ష ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక రీచ్ నుంచి నెలకు రూ. 3 కోట్లకు పైగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియంత్రిత విధానం ద్వారా ఏడాదికి రూ. 700 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరేదని, ఐదేళ్లలో రూ. 3,500 కోట్లు సమకూరాయని గోవర్ధన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఆ ఆదాయమంతా పక్కదారి పట్టి రాజకీయ నేతల పరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక విక్రయాల్లో పారదర్శకత లోపించిందని, అధికారిక పర్మిట్లకు బదులు చేతిరాత స్లిప్పులు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా అందాల్సిన ఇసుక కోసం ట్రాక్టర్లకు రూ. 1,250 వరకు, లారీలకు రూ. 15,000 వరకు వసూలు చేస్తున్నారని ఈ నగదును క్యూఆర్ కోడ్ ద్వారా ప్రైవేట్ ఖాతాలకు మళ్లిస్తున్నారని ఆయన ఆధారాలతో సహా వివరించారు.
అదేవిదంగా పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి విరివూరు, సూర్యపాలెం వంటి రీచ్‌లలో భారీ యంత్రాలతో 10 మీటర్ల లోతు వరకు అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నది తీరాన రోడ్లు నిర్మించడం వల్ల సాగునీటి వ్యవస్థ దెబ్బతింటోందని అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన లోతైన గోతులతో ప్రాణనష్టం కూడా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ దోపిడీపై తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పథకం లక్ష్యం ఒకటి.. అమలవుతున్న తీరు మరొకటి
రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఊతమివ్వడమే కాకుండా సామాన్యులకు భారం తగ్గించాలనే సమున్నత లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం ‘ఉచిత ఇసుక విధానాన్ని’ తెరపైకి తెచ్చింది. ఇళ్ల నిర్మాణాలు మౌలిక సదుపాయాల కల్పనకు తక్కువ ఖర్చుతో ఇసుకను అందించడం, తద్వారా అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. పారదర్శకత కోసం ఆన్‌లైన్ బుకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్జీటీ నిబంధనలకు లోబడి నదీ పరివాహక ప్రాంతాలకు నష్టం కలగకుండా తవ్వకాలు జరపాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
అయితే ప్రభుత్వ ఆశయాలకు క్షేత్రస్థాయిలో తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ జోక్యం పెరగడం, పారదర్శకత కోసం తెచ్చిన సాంకేతికతను పక్కదారి పట్టించి ప్రైవేట్ ఖాతాలకు నగదు మళ్లించడం వంటి సవాళ్లు ఈ పథకం అమలులో ప్రధాన అడ్డంకులుగా మారాయి. అనుమతులు లేని సమయాల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తవ్వకాలు, నదీ తీరాల విధ్వంసం ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారుతున్నాయి. లక్ష్యం బాగున్నా.. అమలులో లోపాలు సామాన్యుడికి ‘ఉచితం’ కాస్తా ‘అధిక ధర’ అన్నట్లుగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
