
ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా
ఫ్రాన్స్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర సంక్షోభం నెలకొంది. కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. కేవలం 27 రోజులు మాత్రమే పదవిలో ఉన్న లెకోర్ను, ఆదివారం రాత్రి కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. దీంతో గత ఏడాది కాలంలో ఫ్రాన్స్‌లో రాజీనామా చేసిన ఐదో ప్రధానిగా, 1958 తర్వాత అత్యంత తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లెకోర్ను నిలిచారు.
గత నెలలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చేత నియమించబడిన లెకోర్ను, అంతకుముందు రక్షణ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన కొత్త మంత్రివర్గ కూర్పు, గత ప్రభుత్వాలలో ఉన్నవారినే ఎక్కువగా కొనసాగించడంతో పార్లమెంట్‌లోని ప్రతిపక్షం, సొంత మద్దతుదారుల నుండి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
రాజీనామాకు కారణాలు ఇవే!
ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను రాజీనామాకు కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొత్త మంత్రివర్గ కూర్పు, దేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, రాబోయే బడ్జెట్ బిల్లుపై మద్దతు కూడగట్టడంలో ఉన్న అసాధ్యత వంటివి ప్రధాన కారణాలుగా ఆ దేశ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్త మంత్రివర్గ కూర్పుపై విమర్శలు
లెకోర్ను రాజీనామాకు ప్రధాన కారణం, ఆయన ప్రకటించిన కొత్త మంత్రివర్గ కూర్పుపై రాజకీయ వర్గాల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, విమర్శలే. లెకోర్ను ప్రకటించిన 18 మంది మంత్రుల జాబితాలో గతంలో రాజీనామా చేసి చేసిన మంత్రులే ఎక్కువగా ఉన్నారు. ఇది ప్రధానంగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ మద్దతుదారులతో నిండి ఉండటం, పాత మంత్రి వర్గాన్నే కొనసాగించినట్లుగా అనిపించడంతో రాజకీయ వర్గాలు దీనిని 'పాత కూర్పునే' మార్పు లేకుండా తీసుకొచ్చినట్లుగా విమర్శించాయి. ఈ మంత్రివర్గ కూర్పు మాక్రాన్‌కు మిత్రపక్షంగా ఉన్న వారిని, అలాగే ప్రతిపక్షాలను ఏకకాలంలో ఆగ్రహానికి గురిచేసింది. కొత్త మార్పును ఆశించిన వారు నిరాశ చెందారు. కొత్త మంత్రివర్గంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశం ఉందని ఫ్రెంచ్ మీడియా తెలిపింది. పని ప్రారంభించకముందే పదవిని కోల్పోవడం కంటే, రాజీనామా చేయడమే ఉత్తమమని లెకోర్ను నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్రాన్స్‌లో దీర్ఘకాలిక రాజకీయ అనిశ్చితి
లెకోర్ను రాజీనామా వెనుక ఉన్న ప్రధాన సమస్య ఫ్రాన్స్‌లో దీర్ఘకాలంగా నెలకొన్న రాజకీయ సంక్షోభం. 2024లో మాక్రాన్ నిర్వహించిన అకస్మాత్తు పార్లమెంటరీ ఎన్నికల ఫలితంగా ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో అప్పటినుంచి ఏ ప్రధాని కూడా స్థిరంగా పనిచేయలేకపోయారు. మాక్రాన్ సెంట్రిస్ట్ కూటమికి మిత్రపక్షాల మద్దతు ఉన్నప్పటికీ ఏ బిల్లును ఆమోదించుకోవాలన్నా, ప్రభుత్వాన్ని నడపాలన్నా ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. ఈ మెజారిటీ లేమి కారణంగానే లెకోర్ను కంటే ముందు పనిచేసిన ఇద్దరు ప్రధానులు (ఫ్రాంకోయిస్ బేరో, మిచెల్ బార్నియర్) కూడా అవిశ్వాస తీర్మానాలు, బడ్జెట్ వివాదాల కారణంగా పదవులను కోల్పోయారు. రాజీనామా అనంతరం లెకోర్ను మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల పక్షపాత వైఖరి, కొంతమంది అహంకారమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీలు రాజీ పడటానికి విముఖత చూపడం వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆర్థిక, బడ్జెట్ సవాళ్లు
ఫ్రాన్స్ ప్రస్తుతం అధిక ప్రభుత్వ రుణం, ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. లెకోర్ను ముందున్న అతిపెద్ద సవాలు 2026 బడ్జెట్‌కు పార్లమెంట్‌లో మద్దతు పొందడం. గత ప్రభుత్వాలు ఓటు లేకుండా రాజ్యాంగంలోని ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి బడ్జెట్‌ను ఆమోదించుకున్నాయి. కానీ లెకోర్ను ఆ పద్ధతిని వాడకుండా, చర్చల ద్వారా ముందుకు వెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌కు ఆమోదం లభించకపోతే ప్రభుత్వం మరోసారి సంక్షోభంలో పడుతుంది. ఈ అనిశ్చితి మధ్య ఏకాభిప్రాయం సాధించడం అసాధ్యమని గ్రహించి, లెకోర్ను రాజీనామా చేశారని తెలుస్తోంది.
ఈ పరిణామాలు అధ్యక్షుడు మాక్రాన్ నాయకత్వంపై, దేశాన్ని నడిపించే ఆయన సామర్థ్యంపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతోంది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు మాక్రాన్ ముందు రెండు కీలకమైన మార్గాలు ఉన్నాయి.ఒకటేమో కొత్త ప్రధానిని ఎన్నుకోవడం, మరొకటి జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్లడం. కాగా లెకోర్ను రాజీనామాతో ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి పతాక స్థాయికి చేరింది. తదుపరి ప్రధాని ఎంపిక, పార్లమెంటరీ మద్దతు కూడగట్టడం అనేది మాక్రాన్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. ఈ పరిణామాల కారణంగా ఫ్రెంచ్ స్టాక్ మార్కెట్ కూడా పతనమైంది.
