Let's talk: editor@tmv.in
ఫ్రాన్స్‌‌లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం!

ఫ్రాన్స్‌‌లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం!

Shaik Mohammad Shaffee
28 జనవరి, 2026

డిజిటల్ యుగంలో చిన్నారుల మేధస్సు సోషల్ మీడియా అల్గారిథమ్స్‌కు బానిస కాకూడదనే లక్ష్యంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధిస్తూ రూపొందించిన బిల్లుకు ఆ దేశ దిగువ సభ (నేషనల్ అసెంబ్లీ) సోమవారం రాత్రి ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలు వచ్చే విద్యా సంవత్సరం (సెప్టెంబర్ 2026) నుంచి అమలులోకి రానున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ బిల్లును అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్లారు.

పిల్లల మెదడు అమ్మకానికి కాదు: మాక్రాన్

బిల్లు ఆమోదం పొందిన అనంతరం అధ్యక్షుడు మాక్రాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మన పిల్లల మెదళ్లు అమెరికా ప్లాట్‌ఫామ్‌లకో, చైనా నెట్‌వర్క్‌లకో అమ్మకానికి లేవు. వారి కలలను కంప్యూటర్ అల్గారిథమ్స్ శాసించకూడదు" అని ఆయన స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియానే కాకుండా, హైస్కూల్ విద్యార్థులు పాఠశాల ఆవరణలో మొబైల్ ఫోన్లు వాడటాన్ని కూడా ఈ చట్టం పూర్తిగా నిషేధించింది.

పెరుగుతున్న మానసిక సమస్యలు

ఫ్రాన్స్ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. దేశంలోని 12 నుండి 17 ఏళ్ల లోపు పిల్లల్లో 90 శాతం మంది ప్రతిరోజూ ఇంటర్నెట్ వాడుతున్నారు. వీరిలో సగానికి పైగా టీనేజర్లు రోజుకు రెండు నుండి ఐదు గంటల సమయాన్ని ఫోన్లకే కేటాయిస్తున్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గడం, మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులు కావడం, చివరకు ఆత్మహత్యలకు పురికొల్పే హానికరమైన కంటెంట్‌ను చూడటం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇటీవల ఫ్రాన్స్‌లో టిక్‌టాక్ చూసి ప్రాణాలు తీసుకున్న కొందరు టీనేజర్ల కుటుంబాలు ఆ సంస్థపై కోర్టులో కేసులు వేయడం అక్కడ సంచలనం సృష్టించింది.

యూరప్ అంతటా ఇదే ట్రెండ్

కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాదు, బ్రిటన్ కూడా టీనేజర్లపై సోషల్ మీడియా నిషేధాన్ని పరిశీలిస్తోంది. అటు ఆస్ట్రేలియాలో ఇప్పటికే 16 ఏళ్లలోపు వారికి నిషేధం విధించగా.. ఫలితంగా దాదాపు 47 లక్షల మంది పిల్లల అకౌంట్లను ఆయా సంస్థలు తొలగించాయి. అయితే ఫ్రాన్స్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం నుంచి విద్యా సంబంధిత వెబ్‌సైట్లు (వికీపీడియా వంటివి), సైన్స్ డైరెక్టరీలు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లకు మినహాయింపు ఇచ్చారు.

వచ్చే నెలలో సెనేట్‌కు

రాజకీయంగా విడిపోయిన ఫ్రాన్స్ పార్లమెంట్‌లో ఈ బిల్లుకు మాత్రం అనూహ్య మద్దతు లభించింది. 130-21 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. అయితే అతివాద పార్టీలు మాత్రం ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని విమర్శిస్తున్నాయి. వచ్చే కొన్ని వారాల్లో ఈ బిల్లు సెనేట్ ముందుకు చర్చకు రానుంది. వచ్చే ఏడాది మాక్రాన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఆయన పాలనలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఇది ఒకటిగా నిలిచిపోనుంది.