
ఫ్రాన్స్‌లో భారతీయ సంతతి గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్‌కు అరుదైన గౌరవం
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా ఫ్రెంచ్ రెసిస్టెన్స్ కోసం ప్రాణాలు అర్పించిన బ్రిటిష్–ఇండియన్ గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్‌కు ఫ్రాన్స్ మరో అరుదైన గౌరవం అందించింది. ఫ్రాన్స్ పోస్టల్ సర్విస్ లా పోస్టే ‘ఫిగర్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్’ పేరిట విడుదల చేసిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌లలో స్థానం పొందిన 12 మందిలో నూర్‌కు కూడా స్థానం కల్పించింది. ఇలా ఫ్రాన్స్ నుంచి పోస్టల్ స్టాంప్ గౌరవం పొందిన ఏకైక భారతీయ మూలాలున్న మహిళగా ఆమె నిలిచారు. నూర్ పై ఉన్న స్టాంప్ ఆమె బ్రిటిష్ మహిళా సహాయక వైమానిక దళం యూనిఫాంలో ఉన్నట్లు చూపిస్తుంది.
నూర్ జీవిత చరిత్ర 'స్పై ప్రిన్సెస్: ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్' రచయిత్రి శ్రాబణి బాసు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ‘ఫాసిజానికి ఎదురు నిలిచి తన ప్రాణాలను బలిదానం చేసిన నూర్‌ను ఫ్రాన్స్ ఈ చారిత్రక 80 ఏళ్ల సందర్భంగా స్మరించటం ఎంతో గొప్ప విషయం’ అని పేర్కొన్నారు. నూర్‌కు బ్రిటన్ 2014లో స్టాంప్ విడుదల చేసి గౌరవించింది. ఇప్పుడు బ్రిటన్–ఫ్రాన్స్ రెండు దేశాలు గుర్తించగా, ఆమె పూర్వీకుల దేశమైన భారతదేశం కూడా ఆమెకు స్టాంప్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని బాసు అభిప్రాయపడ్డారు.
టిప్పు సుల్తాన్ వంశానికి చెందిన వీరనారీ
1914లో మాస్కోలో జన్మించిన నూర్ ఇనాయత్ ఖాన్ భారతీయ సూఫీ సంత్ తండ్రి, అమెరికన్ తల్లి దంపతుల కుమార్తె. బాల్యంలో లండన్, స్కూలు రోజుల్లో పారిస్‌లో నివసించిన ఆమె, ఫ్రాన్స్ నాజీల దాడికి గురైన తర్వాత కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌కు చేరింది. 1943లో బ్రిటిష్ ఉమెన్స్ ఆక్సిలరీ ఎయిర్ ఫోర్స్ లో చేరిన ఆమెను అదే సంవత్సరంలో బ్రిటిష్ గూఢచార సంస్థ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్ఓఈ) రేడియో ఆపరేటర్‌గా ఎంపిక చేసింది. ఇది యుద్ధ సమయంలో ఆక్రమిత భూభాగాల్లో గూఢచర్యం, విధ్వంసం, నిఘా నిర్వహించడానికి సృష్టించిన బ్రిటిష్ రహస్య సేన.
ఆపరేషన్… అరెస్టు… అమానుష హింస
1943 జూన్‌లో ఆక్రమిత ఫ్రాన్స్‌లోకి తొలి మహిళా రేడియో ఆపరేటర్‌గా పంపబడిన నూర్, కొద్ది నెలల్లోనే నాజీల చేతికి చిక్కారు. అనంతరం డాచౌ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌కు తరలించారు. అక్కడ ఆమెను విచక్షణారహితంగా హింసించారు. 1944 సెప్టెంబర్ 13న కేవలం 30 ఏళ్ల వయసులోనే హింసించి ఉరితీశారు.
అంతర్జాతీయ గౌరవాలు
నూర్ ధైర్యానికి గుర్తింపుగా ఫ్రాన్స్ ఆమెకు క్రౌ డీ గేర్, ఫ్రెంచ్ రెసిస్టెన్స్ మెడల్, బ్రిటన్ 1949లో జార్జ్ క్రాస్ (జీసీ) ను మరణానంతరం ప్రధానం చేసింది. ఈ తాజా స్టాంప్‌లలో నూర్‌తో పాటు ఫ్రెంచ్ రెసిస్టెన్స్ నాయకుడు జాన్–పియర్ లేవీ, ఎస్ఓఈ ఏజెంట్ వియోలెట్ స్జబో వంటి ప్రముఖ యోధుల చిత్రాలు ఉన్నాయి.
