Let's talk: editor@tmv.in
ఫ్రాన్స్‌ను కుదిపేసిన భారీ దొంగతనం

ఫ్రాన్స్‌ను కుదిపేసిన భారీ దొంగతనం

Dantu Vijaya Lakshmi Prasanna
24 అక్టోబర్, 2025

పారిస్‌లోని ప్రసిద్ధ లూవ్ర్ మ్యూజియంలో జరిగిన ఒక అత్యంత ప్రణాళికాబద్ధమైన దోపిడీలో, నలుగురు నిందితులు ఫ్రాన్స్ రాజకుటుంబానికి చెందిన అమూల్యమైన ఆభరణాలను దొంగిలించారు. ఫ్రాన్స్ అధికారులు దీన్ని “మన చరిత్రపై దాడి”గా, “అమోఘ వారసత్వ విలువ కలిగిన నష్టం”గా అభివర్ణించారు.

ఈ దోపిడీ పూర్తిగా ప్రణాళికాబద్ధంగా, అత్యంత వేగంగా కేవలం 4 నిమిషాల వ్యవధిలో జరిగింది. నిందితులు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 09:30 సమయానికి మ్యూజియానికి చేరుకున్నారు. మ్యూజియం అప్పుడే తెరుచుకుంది. వారు వాహనంపై అమర్చిన యాంత్రిక లిఫ్ట్ ద్వారా సీన్ నది పక్కన ఉన్న”గాలెరీ ద అపోలోన్” మొదటి అంతస్తు కిటికీ వరకు చేరారు. ఇద్దరు దొంగలు పవర్ టూల్స్‌తో కిటికీని కోసి లోపలికి ప్రవేశించారు, అక్కడ గార్డులను బెదిరించి మిగతా సిబ్బందిని బయటకు పంపించారు. వారు కేవలం నాలుగు నిమిషాలలోనే రెండు ప్రదర్శన పెట్టెల గాజును కోసి ఆభరణాలను తీసుకున్నారు. ఉదయం 09:38 నిమిషాల కల్లా , వారు రెండు స్కూటర్లపై అక్కడి నుండి తప్పించుకున్నారు. మ్యూజియం సిబ్బంది ప్రయత్నించినా వారు దొంగల వాహనాన్ని కాల్చివేయడంలో విఫలమయ్యారు.

దొంగిలించబడిన రాజకుటుంబ ఆభరణాలు

ఫ్రాన్స్ అధికారులు ప్రకటించిన దాని ప్రకారం, 19వ శతాబ్దానికి చెందిన ఎనిమిది విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఇవన్నీ ఫ్రెంచ్ రాజకుటుంబ సభ్యులకు, సామ్రాజ్య పాలకులకు చెందినవే. వేలాది వజ్రాలు, రత్నాలు వీటిలో పొదగబడ్డాయి. యూజెనీ కిరీటం పట్టుకుని దొంగలు పారిపోతున్నప్పుడు పాడైపోయిన స్థితిలో ఉందని మ్యూజియం అధికారులు తెలిపారు. నిపుణుల అంచనా ప్రకారం, దొంగలు ఆభరణాలను విడదీసి, లోహాన్ని కరిగించి రాళ్లను మళ్లీ కట్ చేసి అమ్మే ప్రయత్నం చేయవచ్చు, ఎందుకంటే ఇలాంటి వాటిని యథాతథంగా అమ్మడం కష్టం.

పారిస్ ప్రభుత్వ న్యాయవాది లారె బెక్యూ మంగళవారం ఆర్టీఎల్ రేడియోతో మాట్లాడుతూ, దొంగిలించిన ఆభరణాల విలువ సుమారు 88 మిలియన్ యూరోలు ( భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.896 కోట్లు) ఉంటుందని తెలిపారు. లూవ్ర్ మ్యూజియం దొంగతనంలో పోయిన ఆభరణాలలో ముఖ్యంగా ఇంప్రెస్ యూజెనీ (మూడవ నెపోలియన్ భార్య) కి చెందిన ఒక కిరీటం, బ్రోచ్ ఉన్నాయి. అలాగే, ఇంప్రెస్ మేరీ లూయిస్ కి చెందిన ఒక పచ్చ రత్నాల హారం, ఒక జత పచ్చ రత్నాల చెవిపోగులు దొంగిలించబడ్డాయి. క్వీన్ మేరీ-అమెలీ, క్వీన్ హార్టెన్స్కు చెందిన సఫైర్ సెట్‌లో భాగమైన ఒక కిరీటం, ఒక హారం, ఒకే ఒక్క చెవిపోగు చోరీ అయ్యాయి. వీటితో పాటు, యజమాని వివరాలు తెలియని, "రెలిక్ బ్రోచ్"గా ప్రసిద్ధి చెందిన ఒక బ్రోచ్‌ను కూడా దొంగలు తీసుకువెళ్లారు.

భద్రతా లోపాల పై దర్యాప్తు

అధికారుల ప్రాథమిక నివేదికలో పలు ముఖ్యమైన భద్రతా లోపాలు బయటపడ్డాయి.

• దోపిడీ జరిగిన ప్రాంతంలోని మూడు గదుల్లో ఒకదాంట్లో కూడా సీసీటీవీ కెమెరాలు లేవు.

• దొంగలు చొరబడిన గ్యాలరీలోని స్థానిక అలారం పాడై ఉండగా, ప్రధాన మ్యూజియం అలారం మాత్రం మోగింది. అధికారులు ఆ అలారం కావాలనే ఆపబడిందా అనే అనుమానంతో విచారణ చేస్తున్నారు.

• సుమారు 60 మంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ సిబ్బంది ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు ఈ దొంగలు ఒక అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాకు పనిచేస్తున్నారని అనుమానిస్తున్నారు, ఎందుకంటే ఇది అత్యంత ప్రొఫెషనల్‌గా అమలైన దొంగతనం.

ఈ దొంగతనం ఫ్రాన్స్‌లో రాజకీయంగా పెద్ద కలకలం రేపింది. అధికారులు దీన్ని “చాలా బాధాకరమైనది”, “అసహనీయ అవమానం”గా పేర్కొన్నారు. దొంగతనం జరిగిన తర్వాత సోమవారం లూవ్ర్ మ్యూజియం మూసివేయబడింది. మంగళవారం సాధారణంగా సెలవురోజు. అలాగే బుధవారం కూడా దీన్ని మూసివుంచారు, అని అధికారిక ప్రకటనలో తెలిపారు. భవనాల పాత నిర్మాణాన్ని ఆధునీకరించేందుకు మ్యూజియం అధికారులు ప్రభుత్వం సహాయం కోరారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రోన్ ముందుగా ప్రకటించిన €700 - 800 మిలియన్ల “న్యూ రెనైసాన్స్ ప్రాజెక్ట్”లో భాగంగా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.

లూవ్ర్ మ్యూజియంలో గత దొంగతనాలు

లూవ్ర్ మ్యూజియం ఇప్పుడు అత్యంత భద్రత కలిగినదైనా, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి

• 1911లో ఒక ఉద్యోగి ప్రసిద్ధ మోనాలిసా చిత్రాన్ని దొంగిలించాడు అది రెండు సంవత్సరాల తర్వాత తిరిగి లభించింది.

• 1998లో కళాకారుడు కామిల్ కొరో వేసిన 19వ శతాబ్దపు చిత్రం "లే షెమిన్ డి సెవ్ర్స్" దొంగిలించబడింది ఇప్పటివరకు దాని ఆనవాళ్లు లేవు.

ఇది ఫ్రాన్స్ సాంస్కృతిక వారసత్వానికి తీరని నష్టం కలిగించిన దోపిడీగా చరిత్రలో నిలిచిపోనుంది. లూవ్ర్ మ్యూజియం వంటి కళాత్మక కేంద్రమే ఇంత పెద్ద దొంగతనానికి వేదిక కావడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.