
ఫ్రాన్స్–తెలంగాణ స్నేహబంధం మరింత బలోపేతం: సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ నేతృత్వంలోని బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ భేటీలో హైదరాబాద్‌లో ఫ్రెంచ్ సంస్థల సహకారంతో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫ్రాన్స్ ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో పెట్టుబడులను మరింత విస్తరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఫ్రాన్స్‌తో తెలంగాణకు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు వివిధ రంగాల్లో సహకారం పెంచడానికి దోహదం చేస్తాయని సీఎం అన్నారు. ఐటీ, ఫార్మా, నగర అభివృద్ధి, రవాణా, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో ఫ్రెంచ్ సంస్థలు ఇప్పటికే భాగస్వామ్య ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు.
హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఆహ్వానదాయకమైన నగరం. ఇక్కడ ఫ్రెంచ్ సంస్థలకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో పరస్పర సహకారం పెంచడం ద్వారా ప్రజలకు లాభం చేకూరుతుందని సీఎం అన్నారు.
ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఫ్రెంచ్ సంస్థల భాగస్వామ్యం పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఫ్రాన్స్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కొత్త పెట్టుబడి అవకాశాలు, విద్యా మార్పిడి కార్యక్రమాలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు వంటి అంశాల్లో భవిష్యత్‌లో మరింత సన్నిహితంగా పనిచేయాలని తాము ఆశిస్తున్నామని చెప్పారు.ఈ సమావేశంలో అలయన్స్ ఫ్రాన్సైస్ డె హైదరాబాద్ డైరెక్టర్ మాడ్ మిక్వా, బ్యూరో డె ఫ్రాన్స్ అసిస్టెంట్ రోహిణి రెడ్డిపల్లి, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
