
ఫ్యూచర్ సిటీలో విస్తృత క్రీడా సౌకర్యాలు: మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేయనున్న ప్రతిపాదిత 'ఫ్యూచర్ సిటీ'లో క్రీడల అభివృద్ధి కోసం విస్తృతమైన సౌకర్యాలు ఉంటాయని మాజీ క్రికెటర్ తెలంగాణ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ మంగళవారం అన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా నిర్వహించిన క్రీడలపై ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఆసక్తి, నిబద్ధత వల్ల రాష్ట్రంలో తదుపరి దశలో పెద్ద మోతాదులో మార్పులు కనిపించనున్నాయని తెలిపారు. తెలంగాణ ఇప్పటి వరకూ క్రీడల అభివృద్ధిలో చాలా చేసిందని. ఇక ఫ్యూచర్ సిటీ వస్తే ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తప్పవు. అక్కడ విస్తృత, సమగ్ర క్రీడా వసతులు అందుబాటులో ఉంటాయని అజహరుద్దీన్ అన్నారు.
భారత్ మహిళా జట్టు ప్రపంచకప్ విజయం నేపథ్యంలో మహిళా క్రీడాకారిణులకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ముఖ్యమంత్రికి క్రీడలపై ఉన్న మమకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన స్వయంగా క్రీడాభిమాని. ఫుట్‌బాల్ బాగా ఆడతారు కూడా. డిసెంబర్ 13న ఆయన నా అభిమాన ఆటగాళ్లలో ఒకరైన లియోనల్ మెస్సీతో కలిసి ఆడబోతున్నారు. దాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారు అని మంత్రి తెలిపారు.మెస్సీ తన 'గోట్ టూర్ టు ఇండియా 2025'లో భాగంగా హైదరాబాద్‌ను సందర్శించనున్నారు. యువ అథ్లెట్లకు నైపుణ్యాభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను కూడా అజారుద్దీన్ నొక్కిచెప్పారు. నేను క్రికెట్‌లో నైపుణ్యం కలిగి ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభిస్తే, నేను నా సమయాన్ని వృధా చేసుకుంటాను అని అతను చెప్పాడు.ప్రతిభ ఉన్న రంగంలోనే పట్టు సాధించాలని మంత్రి సూచించారు.
సింధు, జ్వాలల అభిప్రాయాలు
ఓలింపిక్ పతక విజేత పి.వి.సింధు మాట్లాడుతూ, యువ ప్రతిభను తీర్చిదిద్దడానికి కోచింగ్, మద్దతు వ్యవస్థలు బలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రతి క్రీడాకారుడికి వ్యక్తిగత శ్రద్ధ, ప్రత్యేక శిక్షణ అవసరం. అప్పుడు మాత్రమే వారి ప్రతిభ పూర్తిగా వెలుగులోకి వస్తుంది, అని ఆమె అన్నారు.
మాజీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాల గుట్టా మాట్లాడుతూ, రాష్ట్ర క్రీడా విధానాల్లో కోచ్‌ల పాత్రను బలోపేతం చేసే చర్యలు కీలకమని సూచించారు. కోచ్‌లు పూర్తి సమయం క్రీడాకారులపై కేంద్రీకరించేలా విధానాలు ఉండాలని ఆమె అన్నారు.
ప్రభుత్వ సదుపాయాలు అవసరం: అంబటి రాయుడు
క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం క్రీడారంగంలో ఆర్థిక వనరులు ఉన్నవారికి మాత్రమే అధిక అవకాశాలు లభిస్తున్నాయని, పేద కుటుంబాల క్రీడాకారులు కూడా ముందుకు రావడానికి ప్రభుత్వం సమగ్ర సదుపాయాలు కల్పించాలని సూచించారు.
గ్రౌండ్లు, కోచ్‌లు – రాష్ట్ర క్రీడా సంస్థ ప్రణాళిక
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, కొత్త కోచ్‌ల నియామకం జరుగుతోందని, రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు క్రీడా మైదానాల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రీడా పర్యావరణాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎదురువస్తున్న సమస్యలను పరిష్కరిస్తోందని అన్నారు.
క్రీడా వర్సిటీ, ఖేలో ఇండియా – జితేందర్ రెడ్డి
మాజీ ఎంపీ, రాష్ట్ర క్రీడా సలహాదారు ఏ.పీ. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా విధానాన్ని విడుదల చేసిందని, క్రీడా విశ్వవిద్యాలయం స్థాపన కొనసాగుతోందని చెప్పారు. అదేవిధంగా, కేంద్రీయ క్రీడాశాఖ మంత్రి మనసుఖ్ మాండవియాకి తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు, అలాగే ఐఓఏ అధ్యక్షురాలు పీ.టి. ఉషాను సైతం నేషనల్ గేమ్స్ రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
