Let's talk: editor@tmv.in
‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ఆన్‌లైన్‌లో లభ్యమైంది: రాహుల్ గాంధీ

‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ఆన్‌లైన్‌లో లభ్యమైంది: రాహుల్ గాంధీ

Pinjari Chand
11 ఫిబ్రవరి, 2026

భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ప్రచురణపై నెలకొన్న వివాదంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనరల్ నరావణే గానీ, ప్రచురణకర్త పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా గానీ ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారు. లేకుంటే ఇద్దరూ నిజం చెప్పక పోయి వుండవచ్చని ఆయన తేల్చిచెప్పారు. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, 2023లో జనరల్ నరావణే ఎక్స్ లో చేసిన పోస్టును ఉదహరిస్తూ, ఆ పుస్తకం అప్పటికే ఆన్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ‘నా పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. లింక్‌ను ఫాలో అవ్వండి. హ్యాపీ రీడింగ్, జై హింద్’ అని నరావణే స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన అబద్ధం చెప్పారని నేను నమ్మను. కాబట్టి అబద్ధం చెబుతోంది పెంగ్విన్‌నే’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా మాత్రం, ఆ పుస్తకం ఇంకా ప్రచురణ దశకు కూడా వెళ్లలేదని, ముద్రితంగా గానీ, డిజిటల్ రూపంలో గానీ ఒక్క కాపీ కూడా విడుదల కాలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పుస్తకం అమెజాన్‌లో లభ్యమవుతోంది. నరావణే స్వయంగా ‘నా పుస్తకం కొనండి’ అని చెప్పారు. పెంగ్విన్ మాట నమ్మాలా? మాజీ సైన్యాధిపతి మాట నమ్మాలా? నేను నరావణే మాటనే నమ్ముతాను అన్నారు. ఈ వివాదం వెనుక అసలు కారణం ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉన్న అంశాలేనని ఆరోపించారు. ఈ పుస్తకంలో భారత ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బందికరమైన విషయాలు ఉండొచ్చు. అందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకానికి తమకే పూర్తి ప్రచురణ హక్కులు ఉన్నాయని, ఆ పుస్తకం ఇంకా ప్రచురితమవలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎక్కడైనా ముద్రిత, డిజిటల్, పీడీఎఫ్ లేదా ఇతర రూపాల్లో లభిస్తున్న కాపీలు అన్నీ కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని, అలాంటి అక్రమ ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు కూడా స్పందించారు. సోషల్ మీడియా, వార్తా వేదికల్లో పుస్తక ప్రీ-ప్రింట్ కాపీ లభ్యమైందన్న సమాచారంపై స్పెషల్ సెల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇంకా అనుమతి పొందని ప్రచురణ లీకైందా? లేక కాపీరైట్ ఉల్లంఘనా? అన్న కోణాల్లో విచారణ సాగుతోందని పోలీసులు తెలిపారు. గత వారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రసంగించిన సమయంలో, ఈ ‘ప్రీ-ప్రింట్’ పుస్తకం నుంచి రాహుల్ గాంధీ కోట్ చేయడానికి ప్రయత్నించడంతో రాజకీయ దుమారం రేగింది. అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, లోక్‌సభ స్పీకర్ ప్రచురించని సాహిత్యాన్ని ఉటంకించవద్దంటూ స్పష్టమైన రూలింగ్ ఇచ్చారు. ఈ ఘటనతో పుస్తకం నిజంగా ప్రచురితమైందా? లేక దాన్ని అడ్డుకునే ప్రయత్నమా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ప్రీ–ఆర్డర్‌కు, ప్రచురణకు తేడా ఉంది – పెంగ్విన్ స్పష్టీకరణ

మాజీ సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే రచించిన ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పుస్తకం అందుబాటులో ఉందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ మరోసారి స్పష్టీకరణ ఇచ్చింది. పుస్తకం ప్రచురణకు వచ్చిందని చెప్పేందుకు, ప్రీ–ఆర్డర్‌కు ఉంచడమే సరిపోదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఒక పుస్తకం అన్ని రిటైల్‌ ఛానళ్లలో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చినప్పుడే అది ప్రచురితమైందిగా పరిగణిస్తాం. ప్రీ–ఆర్డర్‌ అనేది సాధారణ ప్రచురణా ప్రక్రియలో భాగం మాత్రమే. పుస్తకం ఇంకా ప్రచురణకు రాలేదు, అందుబాటులో కూడా లేదని పెంగ్విన్‌ పేర్కొంది. ప్రకటించిన పుస్తకం, ప్రీ–ఆర్డర్‌లో ఉన్న పుస్తకం, పూర్తిగా ప్రచురితమైన పుస్తకం—ఈ మూడూ ఒకటి కావని స్పష్టం చేసింది.

పెంగ్విన్ ప్రకటనకు మాజీ ఆర్మీ చీఫ్ నరవణే మద్దతు

తన ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ఇంకా ప్రచురితమవలేదని మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే మంగళవారం స్పష్టం చేశారు. ఈ విషయమై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా విడుదల చేసిన ప్రకటనకు ఆయన మద్దతు తెలిపారు. ఎక్స్ లో చేసిన పోస్టులో నరవణే, ‘ఇదే పుస్తకానికి సంబంధించిన ప్రస్తుత స్థితి’ అని పేర్కొన్నారు.