Let's talk: editor@tmv.in
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక పెను కుట్ర: ఎన్. రామచందర్ రావు

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక పెను కుట్ర: ఎన్. రామచందర్ రావు

Gaddamidi Naveen
9 ఫిబ్రవరి, 2026

హైదరాబాద్‌లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదం కేవలం ప్రమాదం కాదని, కీలక కేసుల ఆధారాలను తుడిచిపెట్టేందుకు జరిగిన భారీ కుట్ర అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి, మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొన్నదని, ఈ ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై అనవసర విమర్శలు చేస్తున్నాయని రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ రక్షించిందని, అదే కారణంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి కేసుల్లో ఆ పార్టీ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని సాధారణ ప్రమాదంగా చూడలేమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన పలు కీలక కేసులకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, డీఎన్‌ఏ నివేదికలు, వాయిస్ సాంపిల్స్, డిజిటల్ ఆధారాలు అక్కడే ఉండటంతో ఈ ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కీలక ఆధారాలు ఉన్న ప్రదేశంలో అగ్నిప్రమాదం జరగడం, ఫైళ్లు దగ్ధం కావడం వెనుక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయ‌న‌ అన్నారు.

ఇది మొదటిసారి కాదని, గతంలో సెక్రటేరియట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కూడా కీలక ఫైళ్లు తగలబడ్డాయని ఆయ‌న గుర్తుచేశారు. ఆ ఘటనతో పాటు ప్రస్తుత ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రెండేళ్లు దాటినా అసలు నిందితులను పట్టుకోలేకపోయారని, ప్రభుత్వం విచారణ పేరుతో వ్యవహారాన్ని సాగదీస్తోందని ఆయ‌న విమర్శించారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదారి పట్టించడానికే జరిగిందా అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆయన అన్నారు. అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.

ఇక కర్ల రాజేష్ అనే దళిత యువకుడు పోలీసుల రిమాండ్‌లో ఉండగా మరణించిన ఘటనపై కూడా రాంచందర్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించడమే ఈ ఘటనకు కారణమైందని ఆరోపించారు. ఇది మానవహక్కుల ఉల్లంఘనగా, దళిత సమాజంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఈ కేసులో హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్‌లో దాఖలు చేసిన పిటిషన్లను వేగవంతం చేసి న్యాయం చేయాలని ఆయన కోరారు.