Let's talk: editor@tmv.in
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలి: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలి: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్

Gaddamidi Naveen
9 ఫిబ్రవరి, 2026

నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తారు.

శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ల్యాబ్‌లో ఉన్న పరికరాలు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర ఆధారాలు దెబ్బతిన్నాయని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ, పోలీసుల భద్రతలో ఉండే రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఆధారాలు అక్కడ భద్రపరచబడి ఉంటాయని, ముఖ్యంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విజువల్స్, ఆడియో రికార్డింగ్స్ ల్యాబ్‌లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఆ కేసులో సీఎం రేవంత్ రెడ్డి రూ.50 లక్షల నగదుతో పట్టుబడ్డారని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా, గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన డేటా కూడా అదే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంటోందని క్రిశాంక్ అన్నారు. ఇప్పుడు అగ్నిప్రమాదం కారణంగా ఆ ఆధారాలు ధ్వంసమయ్యాయని చెబుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే దర్యాప్తు నిష్పాక్షికంగా ఉంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయని ఆయ‌న వ్యాఖ్యానించారు.

సీఎంకు సంబంధించిన కేసుల ఆధారాలు నష్టపోయాయని చెప్పబడుతున్న పరిస్థితుల్లో, రాష్ట్ర యంత్రాంగం చేపట్టే విచారణపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి పారదర్శకత కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని ఆయ‌న చెప్పారు. ఇక అధికార వర్గాలు మాత్రం అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని, నష్టం వివరాలను అంచనా వేస్తున్నట్లు వెల్లడించాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.