
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టులో హరీష్ రావుకు ఊరట
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుకు భారీ ఊరట లభించింది.ఈ కేసుకు సంబంధించి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హరీష్ రావుపై విచారణ చేపట్టేందుకు వీలు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
అయితే గతంలో మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హరీష్ రావుపై అప్పట్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం తేల్చిచెప్పింది. అనంతరం పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది.
