
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు.జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరుకావడానికి సిద్ధమవుతున్న వేళ, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం “డ్రామా రాజకీయాలు” చేస్తోందని, పాలన పూర్తిగా దారి తప్పిందని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, తాను గత 15 సంవత్సరాలుగా తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేశానని, తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించానని చెప్పారు. మేం టైమ్‌పాస్ రాజకీయాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలు, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదు. తప్పుడు కేసులు పెట్టి వేధించే సంస్కృతి మాది కాదు అని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ, అవి పేదల జీవితాల్లో వాస్తవమైన మార్పును తీసుకొచ్చాయని తెలిపారు.
తెలంగాణ 'పిచ్చోడి చేతిలో రాయి'లా మారింది
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడిన కేటీఆర్, తెలంగాణ ఈరోజు పిచ్చివాడి చేతిలో రాయి లాగా మారింది. పాలించగల సామర్థ్యం లేని ప్రభుత్వం అధికారంలో ఉంది అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, రోజుకో కొత్త డ్రామాతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా డ్రామాలు చేస్తోందని విమర్శించిన కేటీఆర్, వాటిలో కాళేశ్వరం డ్రామా, గొర్రెల స్కాం డ్రామా, ఫార్ములా-ఈ డ్రామా, ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అన్ని అంశాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను ఎలాంటి అక్రమ లేదా అన్యాయ కార్యకలాపాల్లో ఎప్పుడూ పాల్గొనలేదని కేటీఆర్ మరోసారి తెలిపారు. నా అంతఃకరణే సాక్షి. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని ధీమాగా చెప్పారు. గత 7–8 సంవత్సరాలుగా తనపై తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ కేసులతో తనను అనవసరంగా లింక్ చేయాలని ప్రయత్నించారని, సినీ నటీమణులతో సంబంధాలంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. నన్నే కాదు, నా కుటుంబాన్ని, నా పిల్లలను కూడా మానసికంగా వేధించారు అని తెలిపారు.
నోటీసులకు భయపడం
సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, అధికారుల ముందుకు వెళ్లి వారిని తిరిగి ప్రశ్నిస్తానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోలీసుల విచారణకు వెళ్లడానికి మాకేం ఇబ్బంది లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి భయం లేదు. పైగా ఇది మాకు ఉచిత ప్రచారం లాంటిది అని చమత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులే ఇప్పుడు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే భయంతో మాతో మాట్లాడటానికి వణికిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఏదైనా తప్పు చేశానంటే ఆధారాలు చూపండి అని సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2015లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ.50 లక్షలతో వచ్చిన వ్యక్తిని మేమే పట్టుకున్నాం. ఆ దొంగే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగా విచారణ నిష్పక్షపాతంగా ఉంటే, ముందు ఉన్నతాధికారులను ప్రశ్నించాలి. కానీ రాజకీయ నాయకులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు అని కేటీఆర్ విమర్శించారు. ఈ కేసు పూర్తిగా నిరాధారమని, ప్రజల దృష్టిని పాలనా వైఫల్యాల నుంచి మళ్లించేందుకే ఈ డ్రామా చేస్తున్నారని ఆయన తేల్చిచెప్పారు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ నిరసన
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ హైదరాబాద్‌లోని సిట్ ముందు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కేటీఆర్ చేరుకున్న సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సిట్ నోటీసులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగాయి. కేటీఆర్ కారును చుట్టుముట్టిన పార్టీ కార్యకర్తలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేక నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం సిట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అదే కేసులో సీనియర్ నేత టీ. హరీశ్ రావుకు కూడా ఇటీవలే నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారంపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సిట్ విచారణను ‘టైమ్‌పాస్’ చర్యగా అభివర్ణిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తనపై గత రెండేళ్లుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
సిట్ విచారణలో నేను తప్ప ఏ రావు లేరు
సిట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన లీకులపై ఆధారపడి రాజకీయ నేతల వ్యక్తిత్వ హననం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా పార్టీ నాయకులపై క్యారెక్టర్ అస్సాసినేషన్ జరుగుతున్నదని, అది లీకులపైనే ఆధారపడి నడుస్తోందని ఆయన అన్నారు. సిట్ విచారణలో నేను తప్ప ఏ రావు లేరు అడ్డగోలు లీకులను నమ్మి తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంచాయతీ, పారిశ్రామికవేత్తలపై దాడులు, భూకబ్జాలు, భూములను అడ్డగోలుగా కబ్జా చేసుకోవడం, అమృత్ పథకంలో సంబంధిత కుటుంబాలకు టెండర్లు కేటాయించడం వంటి తీవ్ర వ్యవహారాలపై ఎస్‌ఐటీ ఎందుకు దృష్టి పెట్టడం లేదు? న్యాయం, ధర్మం, ఖాకీ బుక్కు అందరికీ ఒకటే విధంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వం ఇచ్చే లీకులను మీడియా కూడా సత్యసాధ్యత లేకుండా ప్రచురించడం సరికాదు. వాటిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత తెలుసుకొని మాత్రమే ప్రచారం చేయాలి అని సూచించారు. కేటీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లీకులపైనే నడిచే ప్రభుత్వంగా పేర్కొన్నారు, ప్రజలకు నిజమైన సమాచారం ఇవ్వడంలో వైఫల్యం ఎదురవుతున్నదని ఆయన విమర్శించారు.
అవసరమైతే మరలా విచారణ.. సిట్ బృందం
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన క్రైమ్ నెం.243/2024 కేసులో కొనసాగుతున్న తదుపరి దర్యాప్తులో భాగంగా, ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల కేటీఆర్ జనవరి 22, 2026న నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో జనవరి 23న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని దర్యాప్తు అధికారికి హాజరుకావాలని ఆదేశించారు.
నోటీసుల మేరకు కేటీఆర్ నిర్ణీత సమయానికి సిట్/దర్యాప్తు అధికారుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పలు అంశాలపై ఆయనను సవివరంగా విచారించారు. విచారణలో వెలువడిన కీలక అంశాలను ఇప్పటికే రికార్డులో ఉన్న ఆధారాలతో పోల్చి, లోతుగా విశ్లేషిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. అంతేకాకుండా, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్షులను సంప్రదించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని కేటీఆర్‌కు సూచించారు. అవసరమైతే మరలా విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా తెలియజేశారు.
ఈ సందర్భంగా పోలీసులు స్పష్టంచేసినదేమిటంటే, కేటీఆర్‌పై జరిగిన శుక్రవారం విచారణ పూర్తిగా క్రైమ్ నెం.243/2024కు మాత్రమే పరిమితమై ఉందని పేర్కొన్నారు. ఈ కేసు వేలాది మంది పౌరులపై అనుమతి లేకుండా, చట్టవిరుద్ధంగా ఫోన్ నిఘా, ఇంటర్‌సెప్షన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించినదని తెలిపారు. ఈ నిఘా వ్యవహారంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థకు చెందినవారు, ప్రముఖులు సహా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు బాధితులుగా ఉన్నట్లు ఆరోపణలున్నాయని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కొందరు మీడియా సంస్థలు, వ్యక్తులు ఈ ఫోన్ నిఘా చర్యలు భద్రతా కారణాల వల్ల జరిగాయని, ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రచారం చేస్తున్నారని దర్యాప్తు సంస్థ గమనించింది. ఇటువంటి తప్పుడు, ఆధారరహిత ప్రచారాలతో తమకు సంబంధం లేదని, దర్యాప్తు సంస్థ ఈ రకమైన తప్పుదారి పట్టించే కథనాలను పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది.
దర్యాప్తు పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, వృత్తిపరంగా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరైనా నిర్ధారణ కాని సమాచారం లేదా తప్పుదారి పట్టించే వార్తలను ప్రచారం చేయవద్దని, అధికారికంగా చట్టబద్ధ మార్గాల ద్వారా వెలువడే వాస్తవ సమాచారాన్నే విశ్వసించాలని దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది.
