
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ, గతంలో ఆయనకు ఉన్న తాత్కాలిక రక్షణను శాశ్వతం చేస్తూ అప్పీల్‌ను పరిష్కరించింది.
ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ 19న సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీని డిసెంబర్ 25 వరకు పొడిగించింది. విచారణ పూర్తయ్యాక డిసెంబర్ 26న ఆయనను విడుదల చేయాలని, తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని అప్పట్లో కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ ఏడాది జనవరి 16న కేసును మార్చి 10న విచారణకు పెట్టుతూ అప్పటి వరకు ఆయనకు ఇచ్చిన తాత్కాలిక రక్షణను పొడిగించింది.
మంగళవారం జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందని, రాబోయే రోజుల్లో ప్రభాకర్ రావుపై అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు తెలిపారు. మరోవైపు, తాను దర్యాప్తుకు పూర్తిగా సహకరించానని, కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించానని ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు విన్నవించారు. తెలంగాణ హైకోర్టు తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదే కేసులో గత ఏడాది ప్రభాకర్ రావుపై విదేశాల్లో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో మే 22న హైదరాబాద్ కోర్టు ప్రొక్లమేషన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి 2024 మార్చి నుంచి హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఒక సస్పెండ్ చేసిన డీఎస్పీతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. వీరు వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తొలగించడం, అలాగే ఫోన్ ట్యాపింగ్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తరువాత వారికి బెయిల్ మంజూరైంది.
కేసు నేపథ్యం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రయోజనాల కోసం పౌరుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేశారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఉన్నాయి. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖుల అనుమతి లేకుండా నిఘాలో పెట్టడం ఈ కుట్రలో భాగమని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అదే విధంగా అనుమతి లేకుండా పలువురు వ్యక్తులపై ప్రొఫైల్స్ తయారు చేసి, వారిని రహస్యంగా చట్టవిరుద్ధంగా పర్యవేక్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం రాజకీయంగా ఒక పార్టీకి అనుకూలంగా ఉపయోగించారని కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. తాజా తీర్పుతో ప్రభాకర్ రావుకు పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే, దర్యాప్తుకు సహకరించాలని ఛార్జ్‌షీట్ ప్రక్రియకు అడ్డుపడకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
