Let's talk: editor@tmv.in
ఫోన్ ట్యాపింగ్ కేసు.. దర్యాప్తు వేగవంతం చేయండి: బీజేపీ నేత ప్రకాష్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. దర్యాప్తు వేగవంతం చేయండి: బీజేపీ నేత ప్రకాష్

Gaddamidi Naveen
3 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కేసులో దర్యాప్తు రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తులో జాప్యం వల్ల కీలక ఆధారాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌)ను ఆదివారం దాదాపు ఐదు గంటల పాటు విచారించడాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ దర్యాప్తును దాదాపు రెండేళ్లుగా ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు. విచారణ పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రజల్లో అయోమయం నెలకొంటోంది. వెంటనే దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆయన కోరారు.

మాజీ డీసీపీ పి. రాధాకృష్ణ రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టేందుకు మీడియా ప్రతినిధులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల ఫోన్లను అక్రమంగా పర్యవేక్షించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతలను సిట్ అధికారులు విచారించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. బీజేపీ త్వరితగతిన విచారణ కోరుతుండగా, బీఆర్ఎస్ దీనిని రాజకీయ వేధింపుగా అభివర్ణిస్తోంది.