Let's talk: editor@tmv.in
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు

Dantu Vijaya Lakshmi Prasanna
23 జనవరి, 2026

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చేసుకుంది. మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11గంటలకు విచారణకు రావాలని నోటీసులో సిట్‌ పేర్కొంది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్‌ సుమారు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధమున్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని అధికారులు ఆదేశించారు. ఈ కేసులో హరీశ్‌రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని సిట్‌ నిర్ణయించింది. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ ఆరోపణలపై 2024 మార్చి 10 నుంచి కేసు దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే కొందరు నిందితులపై ప్రధాన అభియోగపత్రం దాఖలయ్యాయి. ఇంకా లోతుగా సిట్‌ దర్యాప్తు చేస్తోంది.

హరీష్ రావును ఇంటరాగేట్ చేసిన రెండు రోజుల్లోనే విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు సిట్ నోటీసులు పంపడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఇటీవల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను ఈ టీమ్‌లో నియమించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ, ఇతర నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో సజ్జనార్ సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పటికే స్పెషల్ టీమ్ ప్రాథమిక సమాచారం సేకరించింది. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్‌లో పలువురు కీలక నేతల పేర్లు పరోక్షంగా వెల్లడయ్యాయి.

ఈ నోటీసుపై స్పందించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతుందని, కొన్నిరోజులు కాళేశ్వరం అని, మరికొన్నిరోజులు కార్ రేసింగ్ కేసు అని, తరువాత గొర్రెల స్కామ్ అని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని ఇలా రోజుకో డ్రామా ఆడుతుందని వీళ్ళ తాటాకు చప్పుళ్లకు, నోటీసులకు బయపడేదిలేదని అన్నీ చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నారు.

భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై పలువురు బీఆర్ఎస్ నేతలు స్పందించారు.

ఈ నోటీసులపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందిస్తూ, బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంతు నోటీసుల డ్రామా ఆడుతున్నాడన్నారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు అని అన్నారు. రేవంత్ బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఆ టెన్షన్‌తో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే నిన్న నాకు, నేడు కేటీఆర్‌‌కు ఇచ్చిన నోటీసులు అని వ్యాఖ్యానించారు. రేవంత్ గుర్తుపెట్టుకో.. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం, దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

మీరు బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. మేం ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా నిలబడి నిన్ను నిలదీస్తున్నాం. మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమే, కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి నువ్వు సిద్దంగా ఉండు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బీఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా నిన్ను, నీ పార్టీని వదిలిపెట్టం. అంతే కాదు, మీ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటాం . నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారన్నారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వ "రాజకీయ నాటకం"గా అభివర్ణిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.

పాలన గాలికి.. నోటీసుల డ్రామా

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే 'చిల్లర ప్రయత్నాలు' చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు అల్లాడుతుంటే, కనీసం సమీక్ష నిర్వహించే నాథుడే లేడని విమర్శించారు. సంక్రాంతి పండుగ ముగిసి వారం దాటినా, రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు.

సీఎం విదేశీ పర్యటనలు - ప్రజా ధనం దుర్వినియోగం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని, ప్రజల కష్టాలను వారి కర్మానికి వదిలేశారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ సొమ్ముతో దావోస్, అమెరికా పర్యటనలు చేస్తూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం విదేశాల్లో విహరిస్తూ.. అక్కడి నుండి తిరిగి వచ్చే వరకు రాష్ట్రంలో ఏదో ఒక గొడవ నడవాలనే ప్లాన్‌తోనే ఈ ఫోన్ ట్యాపింగ్ సీరియల్ నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు, పస లేని ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని అత్యున్నత న్యాయస్థానాలే తేల్చి చెప్పాయని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. రెండేళ్లుగా దర్యాప్తు బృందం 'కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని' విమర్శించారు. అధికారులు మారుతున్నారే తప్ప, బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోతున్నారని, ఈ కేసు కేవలం ఒక 'మొగలి రేకులు' సీరియల్ లాగా సాగుతోందని వ్యాఖ్యానించారు.

రేవంత్ సర్కారు ఆడించినట్లుగా పోలీస్ యంత్రాంగం ఆడుతుండటం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖల వెన్ను విరిచారని, వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.

న్యాయపోరాటానికి సిద్ధం

ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని నిరంజన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజా సమస్యలపై పట్టుబడుతున్న ప్రతిపక్షాలను అక్రమ కేసులతో వేధించాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని, సమయం వచ్చినప్పుడు ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.