Let's talk: editor@tmv.in
ఫైర్ సేఫ్టీపై హైడ్రా తనిఖీలు ప్రారంభం

ఫైర్ సేఫ్టీపై హైడ్రా తనిఖీలు ప్రారంభం

Pinjari Chand
30 జనవరి, 2026

నగరంలో అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా అధికారులు కఠిన చర్యలకు దిగారు. షాపులు, వాణిజ్య సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ షోరూమ్‌లను సీజ్ చేశారు.

జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–36లో ఉన్న నీరూస్ షోరూమ్‌ను గురువారం హైడ్రా అధికారులు తనిఖీ చేశారు. మూడు సెల్లార్లు, నాలుగు అంతస్తులు ఉండగా, పైభాగంలో అనుమతి లేకుండా రూఫ్ షెడ్ ఏర్పాటు చేసి, పెద్ద మొత్తంలో వస్త్రాలను నిల్వ ఉంచినట్టు గుర్తించారు. రెండు అంతస్తుల్లో అమ్మకాలు, మిగతా మూడు అంతస్తుల్లో వస్త్రాల తయారీతో పాటు గోదాములా నిల్వలు ఉంచడాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు. ఫైర్ ఎన్ఓసీ లేకుండా షోరూమ్ నిర్వహించడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా లేకపోవడం వంటి అంశాలు బయటపడటంతో షోరూమ్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. హైడ్రా, ఫైర్ సర్వీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు కలిసి చర్యలు చేపట్టారు. షోరూమ్‌ను ఫైర్ అన్‌సేఫ్ షాప్ గా ప్రకటిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. హైడ్రా ఫెన్సింగ్ వేసి, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

నాంపల్లిలో ఫర్నిచర్ షోరూమ్‌కు తాళం

నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఇటీవల బచ్చాస్ ఫర్నిచర్ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన తర్వాత కూడా అక్కడి వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని హైడ్రా కమిషనర్ తీవ్రంగా తప్పుబట్టారు. అదే రోడ్డులో ఉన్న రహీమ్, మన్నన్ ఎస్టేట్స్ స్టాండర్డ్ ఫర్నిచర్ షోరూమ్ భవనం మొత్తం ఆరు అంతస్తులుండగా, సెల్లార్ సహా అన్ని అంతస్తుల్లో భారీగా ఫర్నిచర్ నిల్వలు ఉంచినట్టు గుర్తించారు. మెట్ల మార్గాన్ని కూడా మూసివేసేలా స్టాక్ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఎన్ఓసీ లేకపోవడంతో పాటు, ఏ అంతస్తులోనూ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కనిపించకపోవడంతో భవనం మొత్తాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపేశారు.

ఫైర్ నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి

ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపులు లేదా వాణిజ్య సముదాయాలను ఎవరైనా గమనిస్తే, హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667 లేదా నేరుగా 7207923085 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను కోరారు. షాపులను గోదాములుగా మార్చడం, సెల్లార్లలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు నిల్వ ఉంచిన వివరాలను స్పష్టంగా పేర్కొంటూ ఫొటోలు, వీడియోలతో వాట్సాప్ ద్వారా పంపాలని సూచించారు. అలాగే CommissionerHYDRAA పేరుతో ఉన్న ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.