Let's talk: editor@tmv.in
ఫైనల్‌కు భారత మహిళల హాకీ జట్టు

ఫైనల్‌కు భారత మహిళల హాకీ జట్టు

Shaik Mohammad Shaffee
14 మార్చి, 2026

భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని జి.ఎం.సి బాలయోగి హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్-2026 క్వాలిఫైయర్స్ సెమీఫైనల్లో భారత్ 1-0 తేడాతో ఇటలీపై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా, 2026 ప్రపంచకప్‌కు తన బెర్తును అధికారికంగా ఖరారు చేసుకుంది. నేడు జరగనున్న తుది పోరులో ఇంగ్లాండ్‌తో భారత జట్టు తలపడనుంది.

హోరాహోరీగా తొలి సగం

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న భారత్, 19వ ర్యాంకర్ ఇటలీల మధ్య మ్యాచ్ ఆరంభం నుంచే హోరాహోరీగా సాగింది. తొలి క్వార్టర్లో ఇటలీ జట్టు గట్టి పోటీనిస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. అయితే, రెండో క్వార్టర్ నుంచి భారత్ తన జోరును పెంచింది. 18వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను నవనీత్ కౌర్ గోల్‌గా మలిచే ప్రయత్నం చేయగా, ఇటలీ గోల్ కీపర్ లూసియా ఇనెస్ దాన్ని అడ్డుకుంది. 27వ నిమిషంలో కెప్టెన్ సలిమా టెటే కొట్టిన షాట్‌ను ఇటలీ డిఫెండర్ అద్భుతంగా ఆపి భారత్ ఆశలను ఆవిరి చేసింది.

మనీషా మెరుపు గోల్

రెండో సగంలో ఇరు జట్లు గోల్ కోసం ముమ్మరంగా ప్రయత్నించాయి. మ్యాచ్ 40వ నిమిషంలో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ అవకాశాన్ని మనీషా చౌహాన్ అద్భుతంగా మలచుకుంది. ఆమె సంధించిన పవర్‌ఫుల్ డ్రాగ్‌ఫ్లిక్ ఇటలీ రక్షణ కవచాన్ని ఛేదిస్తూ గోల్ పోస్టులోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ 1-0 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. చివరి క్వార్టర్లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్, స్కోరును సమం చేయాలని ఇటలీ పోరాడాయి. చివరి నిమిషంలో (59వ నిమిషం) ఇటలీకి పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ, భారత డిఫెండర్లు అప్రమత్తంగా వ్యవహరించి దాన్ని అడ్డుకున్నారు.

ప్రపంచకప్‌‌నకు అర్హత

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరడం ద్వారానే భారత్ ప్రపంచకప్ అర్హతను సాధించింది. హైదరాబాద్‌తో పాటు చిలీలోని శాంటియాగోలో కూడా మరో క్వాలిఫైయింగ్ టోర్నీ జరుగుతోంది. ప్రతి టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, భారత్ తన సొంత గడ్డపై అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరిస్తోంది. నేడు ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్ పోరులో గెలిచి క్వాలిఫైయర్స్ విజేతగా నిలవాలని భారత్ పట్టుదలతో ఉంది.