
ఫెమినిజం అంటే......
తరాలు మారిన అంతరాలు పోని ఈ సమాజంలో అందరూ సమానత్వం కావాలి అంటూ ఉద్యమాలు చెయ్యడం చూస్తుంటాం.ఇది ఇప్పటి సమస్య కాదు. ఆడపిల్లల వంటగదిని దాటి ఎప్పుడో ఆకాశాన్ని అందుకున్నారు.కానీ కొన్నిసార్లు వారికి సరైన మార్గ నిర్దేశం లేక సర్దుబాటు చేసుకోవడం రాక ఇబ్బంది పడుతున్నారు. హక్కుల గురించి పోరాడేవారికి చట్టాలు తెలియాలి. అవి ఎలా ఉపయోగపడతాయి. సమస్యలను ఎలా అధికమించాలి .అనే ఆలోచన ఉంటే సమానత్వం అనేది దేనికి అనేది అర్థమవుతుంది. అన్ని సామాజిక వర్గాలలో స్త్రీలకు గుర్తింపునేది ఉంది. ఎక్కడో కొన్ని చోట్ల ఇంకా ఆర్ధిక సమానత్వం కోసం ఉద్యమాలు జరిగినా ప్రస్తుతమైతే భారత దేశంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు.భేటీ బచావో భేటి పడావో లాంటి పథకాలు అమలులో ఉన్నా కొన్ని ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కలగాలి. అసలు ఫెమినిజం (సమానత్వం)అంటే ఏమిటో చూద్దాం.
ఫెమినిజం అనే పదం “స్త్రీ సమానత్వం” అనే భావనకు ప్రతీక. ఇది కేవలం ఒక ఉద్యమం మాత్రమే కాదు. ఒక ఆలోచనా విధానం, సామాజిక మార్పు దిశలో సాగిన బౌద్ధిక విప్లవం. స్త్రీలు కూడా పురుషుల్లాగే సమాన హక్కులు, అవకాశాలు, స్వేచ్ఛలు, గౌరవం పొందాలన్న ఆలోచనే సమానత్వం మూల సారం. శతాబ్దాలుగా స్త్రీలపై కొనసాగిన వివక్ష, అన్యాయం, నిర్బంధాలకు వ్యతిరేకంగా ఇది నిలిచింది. ఫెమినిజం అనే భావన 18వ శతాబ్దం యూరప్ లోని సామాజిక మార్పుల కాలంలో మొదలైంది. ఫ్రెంచ్ విప్లవం తరువాత సమానత్వం అనే భావన వేగంగా వ్యాపించింది. ఆ కాలంలో మెరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ రాసిన “ఎ విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ విమెన్ “ అనే గ్రంథం స్త్రీ హక్కులకు పునాదిగా నిలిచింది.
భారతదేశంలో స్త్రీ స్వాతంత్రానికి తొలి దీపం వెలిగించిన వారిలో రాజా రామ్మోహన్ రాయ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, సవిత్రీబాయి ఫూలే, ఆనందీబాయి జోషి, సరోజినీ నాయుడు, వీరేశలింగం పంతులు వంటి మహనీయులు ఉన్నారు. వారు స్త్రీ విద్య, వితంతు వివాహం, బాల్యవివాహాల నిర్మూలన వంటి అంశాలపై పోరాటం చేశారు. ఆధునిక కాలంలో ఫెమినిజం ఒక అంతర్జాతీయ దిశగా పరిణమించింది. ఇది కేవలం హక్కుల పరిమితి కాకుండా సమాజంలో లింగ సమానత్వం, వృత్తి అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల వరకూ విస్తరించింది.
సమానత్వం ఉద్దేశ్యం .
ఫెమినిజం యొక్క ప్రధాన లక్ష్యం సమాజం లో స్త్రీకి అన్నీ రంగాల్లో సమాన స్థానం కల్పించడం.
విద్యా సమానత్వం:స్త్రీకి విద్యలో సమాన అవకాశాలు ఇవ్వడం. మహిళలకు కూడా పురుషుల మాదిరిగానే విద్యా అవకాశాలు, హక్కులు సమానంగా లభించాలి అన్న భావం. స్త్రీలు కూడా చదువుకోవడం, నైపుణ్యాలు సంపాదించడం, ఉద్యోగాలు సాధించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలలో ఎవరి ఆధీనంలోనూ కాకుండా స్వేచ్ఛగా ముందుకు సాగ గలగాలి అన్నది. లింగభేదం లేకుండా అందరికీ విద్య హక్కు ఉండాలి, స్త్రీలు కూడా సమాజ నిర్మాణంలో సమానంగా భాగస్వాములు కావాలి అన్న న్యాయసూత్రం అమలుకావడం.
భారతీయ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం స్త్రీలకు పురుషుల మాదిరిగానే విద్యా హక్కులు ,అవకాశాలు కల్పిస్తుంది. మహిళలు విద్యలో లింగభేదం లేకుండా అభివృద్ధి చెందడానికి చట్టపరమైన హక్కులు కలిగి ఉంటారు.
రాజ్యాంగం లో **ముఖ్యమైన చట్టపరమైన అంశాలు:*
సమానత్వ హక్కు: చట్టం ముందు ప్రతి పౌరుడు సమాన హక్కులు పొందుతారు. లింగం ఆధారంగా ఎవరినీ వేరుచేయరాదు.
వివక్ష నిషేధం: స్త్రీలను లింగం ఆధారంగా వివక్ష చేయరాదు. ప్రభుత్వం మహిళల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.
విద్యహక్కు చట్టం 2009 : 6 - 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ ,నిరంతరాయమైన విద్య హక్కుగా ఉంది. ఇందులో స్త్రీలు కూడా సమానంగా లబ్ధి పొందుతారు.
మహిళల విద్య కోసం ప్రత్యేక పథకాలు:
భేటీ భచావో భేటీ పడావో, సరల్ స్కీమ్, స్కాలర్‌షిప్‌లు, ప్రధానమంత్రి ఆధునిక విద్యా పథకాలు
విశ్వవిద్యాలయ ,విద్యా సంస్థల్లో సమాన హక్కు:
విద్యాసంస్థలు లింగ భేదం లేకుండా అనుమతి, చదువు, పరీక్షలు, వృత్తి శిక్షణ లో స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించాలి.భారత రాజ్యాంగం ,సంబంధిత చట్టాలు స్త్రీలకు విద్యా సమానత్వాన్ని నిర్ధారించడం ద్వారా ప్రతిభ, స్వాతంత్రాన్ని సమర్థంగా ఉపయోగించుకునే అవకాశం ఇస్తాయి.
ఆర్థిక స్వావలంబన: ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక నిర్ణయాల్లో స్త్రీకి స్వతంత్ర స్థానం ఉండడం. మహిళలకు కూడా పురుషుల మాదిరిగా ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాలు, సంపాదన హక్కులు, ఆస్తి హక్కులు సమానంగా లభించాలి అన్న భావం. అంటే, స్త్రీలు కూడా ఉద్యోగాలు చేసుకోవడం, వ్యాపారాలు ప్రారంభించడం, సొంత ఆస్థి కలిగి వుండడం. తమ ఆదాయాన్ని స్వయంగా వినియోగించడం వంటి హక్కులు సమానంగా పొందాలి. స్త్రీలు కూడా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండి, పురుషుల పక్కన సమానంగా జీవనోపాధి సంపాదించగలగడం, అభివృద్ధి అవకాశాలు పొందడం.
భారతీయ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం స్త్రీలకు పురుషుల మాదిరిగానే ఆర్థిక హక్కులు ,అవకాశాలు కల్పిస్తుంది. లింగభేదం లేకుండా స్త్రీలు కూడా సంపాదించడానికి, ఆస్తి కలిగి ఉండటానికి, వ్యాపారాలు చేసుకోవడానికి హక్కులు కలిగి ఉంటారు. ప్రతి పౌరుడికి చట్టం ముందు సమానత్వం ఉంది. లింగం ఆధారంగా ఎవరినీ వివక్ష చేయరాదు. లింగం ఆధారంగా వివక్ష చేయరాదు. అలాగే స్త్రీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు, అవకాశాలు పొందడంలో స్త్రీలకు కూడా సమాన హక్కు ఉంది.
హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005: ఈ చట్టం ప్రకారం కూతురు కూడా కొడుకుతో సమానంగా తండ్రి ఆస్తిలో వాటా పొందే హక్కు కలిగింది. ఇది ఆర్థిక స్వాతంత్ర్యానికి పెద్ద అడుగు.
సమాన వేతన చట్టం, 1976 : ఒకే విధమైన పనికి స్త్రీలకు కూడా పురుషుల మాదిరిగానే సమాన వేతనం ఇవ్వాలి. లింగభేదం ఆధారంగా వేతనంలో తేడా చేయరాదు.
మాతృత్వ ప్రయోజన చట్టం, 1961: ఉద్యోగం ,పని చేసే మహిళలకు మాతృత్వ కాలంలో జీతం, సెలవులు, భద్రతా హక్కులు కల్పిస్తుంది.
మహిళా వ్యాపార ప్రోత్సాహక పథకాలు: భారత ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్టాండప్ ఇండియా, ముద్రా యోజన, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వంటి పథకాలు అమలు చేస్తోంది. భారత రాజ్యాంగం ,చట్టాలు స్త్రీలకు ఆర్థికంగా స్వతంత్రత, సమాన వేతనం, ఆస్తి హక్కులు ,ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడానికి పునాది వేసాయి.
రాజకీయ హక్కులు: భారతీయ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం స్త్రీలకు కూడా పురుషుల మాదిరిగానే సమాన రాజకీయ హక్కులు కల్పించింది. ఈ హక్కులు స్త్రీలు కూడా దేశ రాజకీయ వ్యవస్థలో సమానంగా పాల్గొనడానికి మార్గం సుగమం చేస్తాయి. చట్టం ముందు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయి. లింగం ఆధారంగా ఎవరినీ వేరుచేయరాదు. లింగభేదం లేకుండా స్త్రీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి అని భారతీయ చట్టం చెబుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి. భారత రాజ్యాంగం స్త్రీలకు పురుషుల మాదిరిగానే ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి హక్కులు ఇచ్చింది.
మహిళా రిజర్వేషన్ (73వ, 74వ రాజ్యాంగ సవరణలు): గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబడింది.
మహిళా బిల్లు (108వ సవరణ ప్రతిపాదన): పార్లమెంట్ ,రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రయత్నం. (ఇది ప్రస్తుతం నారీ శక్తి వందన్ బిల్లు పేరుతో ఆమోదించబడింది).
భారత రాజ్యాంగం స్త్రీలకు రాజకీయ హక్కులు, సమాన ప్రతినిధిత్వం ,నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో బలమైన చట్టపరమైన ఆధారాన్ని ఏర్పరచింది.
సామాజిక గౌరవం: లింగ వివక్ష, హింస, వేధింపులు, వంచనల నుండి స్త్రీ రక్షణ పొందడం.
స్వీయ నిర్ణయాధికారము: వివాహం, గర్భధారణ, వృత్తి ఎంపిక, జీవనశైలి విషయంలో స్త్రీకి స్వేచ్ఛ ఉండడం .
మరింత లోతుగా భారత రాజ్యాంగంలోని మహిళల హక్కులు
మహిళలతో సహా పౌరులందరికీ ప్రాథమిక స్థాయి సంక్షేమాన్ని నిర్ధారించడానికి విధానాలను రూపొందించడం ,అమలు చేయడం. మహిళలకు ఆస్తిని కలిగి ఉండే స్వేచ్ఛను ఇవ్వడం, ఆస్తులను కలిగి ఉండే ,సొంతం చేసుకునే వారి హక్కును నిర్ధారించడం. మహిళల శ్రేయస్సు ,పని-జీవిత సమతుల్యతకు మద్దతు ఇవ్వడానికి వారికి ప్రసూతి సెలవు ,ఇతర పని హక్కులను అందించడం. పంచాయతీలు (స్థానిక స్వపరిపాలన సంస్థలు) ,నగర కౌన్సిళ్లలో మహిళలకు 33 శాతం కోటాను తప్పనిసరి చేయడం, మహిళల రాజకీయ భాగస్వామ్యం ,ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడం.సమాన పనికి సమాన వేతనాన్ని హామీ ఇవ్వడం, పురుషులు ,మహిళలు సమాన వేతనం పొందేలా చూడటం. మహిళల పట్ల వివక్షాపూరిత అభిప్రాయాలు, పద్ధతులను ఎదుర్కోవడం, సమానత్వం ,సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం.
ఫెమినిజం అంటే పురుషుల మీద వ్యతిరేక భావం కాదు. అది ఇద్దరికీ సమాన గౌరవం ఉన్న సమాజం నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం.
భారతదేశంలో ఫెమినిజం ప్రభావం
భారతదేశంలో ఫెమినిజం పలు దశల్లో అభివృద్ధి చెందింది. స్వాతంత్ర సమర కాలంలో స్త్రీలు సమానంగా రాజకీయ రంగంలో అడుగుపెట్టారు .సరోజినీ నాయుడు, ఉషా మెహతా, కస్తూర్బా గాంధీ వంటి నాయకులు దీనికి సాక్ష్యం.
స్వాతంత్రo తర్వాత సాంఘిక చట్టాలు స్త్రీ హక్కులను రక్షించాయి . ఉదాహరణకు వరకట్న నిషేధ హక్కు (1961) గర్భ వాతుల ప్రయోజన చట్టం (1961) పోక్సో చట్టం (2012) మొదలైనవి.ఆధునిక భారతదేశంలో స్త్రీ విద్య, ఉద్యోగాలు, క్రీడలు, సినిమాలు, రాజకీయాలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్నారు. కల్పనా చావ్లా, సైనా నెహ్వాల్, నితా అంబానీ, కిరణ్ బేడీ, ద్రౌపది ముర్ము వంటి మహిళలు కొత్త దారులు చూపించారు.అయితే, ఇంకా లింగ ఆధారిత హింస,పురుషులకంటే తకువ వేతనాలు, మెంటల్ ,మెంటల్ బర్డెన్ వంటి సమస్యలు పూర్తిగా తగ్గలేదు. అందుకే ఫెమినిజం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది.
సమకాలీన ఫెమినిజం - సాంకేతికతలో స్త్రీ స్వరం
నేటి డిజిటల్ యుగంలో ఫెమినిజం కొత్త రూపం సంతరించుకుంది. సోషల్ మీడియా ద్వారా మి టూ ,షిలీడ్స్ , బ్రేక్ తే బయాస్, వంటి ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా మహిళల గొంతుకను వినిపిస్తున్నాయి. స్త్రీలు తమ అనుభవాలను, బాధలను, విజయాలను పంచుకుంటూ ఇతరులను ప్రేరేపిస్తున్నారు. సాంకేతికత ద్వారా స్త్రీలు ఇప్పుడు స్టార్టప్‌లు, టెక్ లీడర్‌షిప్, ఆన్‌లైన్ విద్యా సంస్థలు వంటి రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఇది ఫెమినిజం యొక్క ఆధునిక రూపం సమాన అవకాశాలు, సమాన గౌరవం, స్వీయ నిర్ణయాధికారానికి ప్రాధాన్యత ఇచ్చే దశ.
సమానత్వం అనేది స్త్రీల కోసం మాత్రమే కాదు, మానవ సమాజ సమతుల్య అభివృద్ధి కోసం అవసరమైన సిద్ధాంతం. ఇది పురుషుని ప్రతిష్ఠను తగ్గించేది కాదు. ఇద్దరి గౌరవాన్ని పెంచేది. సమాజం నిజమైన అర్థంలో అభివృద్ధి చెందాలంటే, స్త్రీ, పురుష సమానత్వం, గౌరవం, సహకారం అత్యవసరం. ఫెమినిజం చివరికి ఒక ఉద్యమం కాదు .అది మానవ హృదయాల మార్పు కోసం సాగుతున్న ఆలోచనా యాత్ర.
