
ఫెడరలిజంపై జాతీయ చర్చకు మద్దతు.. స్టాలిన్‌కు సీఎం సిద్ధరామయ్య లేఖ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్‌కు మంగళవారం లేఖ రాసి, యూనియన్–స్టేట్ సంబంధాలపై మళ్లీ జాతీయ స్థాయిలో చర్చ జరగాలని బలంగా మద్దతు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో ఫెడరలిజం కీలక భాగమని ఆయన స్పష్టం చేశారు. ‘ఫెడరలిజం రాజకీయ డిమాండ్ కాదు. అది రాజ్యాంగపు మౌలిక సూత్రం. ఆర్థిక, శాసన పరమైన అంశాల్లో పెరుగుతున్న కేంద్రీకరణ రాజ్యాంగ రచయితలు ఊహించిన సమతుల్యతను దెబ్బతీస్తోంది. రాష్ట్రాలకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేందుకు తగిన అధికారాలు, ఆర్థిక స్వాతంత్ర్యం అవసరమని సిద్ధరామయ్య ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశ బలం సహకార ఫెడరలిజం, రాజ్యాంగ పరమైన విశ్వాసం, వైవిధ్యానికి గౌరవం అని పేర్కొన్న ఆయన, అన్ని రాష్ట్రాలు చర్చించేందుకు తిరిగి ప్రారంభమైన ఇంటర్-స్టేట్ కౌన్సిల్ వంటి వేదికను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరతామని తెలిపారు. భారత ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కర్ణాటక నిర్మాణాత్మకంగా సహకరిస్తుందని చెప్పారు.
తమిళనాడు రాజకీయాల్లో కదలికలు
2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ చర్చలు వేగం పుంజుకున్నాయి. కాంగ్రెస్ నేత పీ. చిదంబరం, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే.సెల్వపెరుంతగై, సీఎం స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలసి డీఎంకే–కాంగ్రెస్ సీటు పంచకం అంశంపై చర్చించనున్నారు. సీటు పంపకంపై విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని ఖండించిన సెల్వపెరుంతగై, ‘ఎన్నికల ముందు చర్చలు సహజం. ప్రతి పార్టీ ఎక్కువ సీట్లు కోరుతుంది. చివరకు ఒక ఒప్పందానికి వస్తారని తెలిపారు. ఇండియా బ్లాక్‌లో డీఎంకే–కాంగ్రెస్ భాగస్వామ్యం సిద్ధాంతపరమైనదేనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే.పళనిస్వామి మార్చి 2న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలసి 2026 ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి 2026 ఏప్రిల్–మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఫెడరల్ పునరుద్ధరణ సామూహిక కృషితోనే సాధ్యం: స్టాలిన్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫెడరలిజంపై జాతీయ స్థాయి చర్చకు మద్దతు తెలుపుతూ పంపిన లేఖకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజ్యాంగ సమతుల్యతను కాపాడాలంటే ఫెడరల్ పునరుద్ధరణను అన్ని రాష్ట్రాలు కలిసి ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. స్టాలిన్ ఎక్స్‌లో చేసిన పోస్టులో , తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూనియన్–స్టేట్ సంబంధాలపై హై లెవల్ కమిటీ తొలి భాగ నివేదికకు సిద్ధరామయ్య మద్దతు తెలపడం అభినందనీయమని తెలిపారు. వైవిధ్యభరితమైన భారతదేశంలో ఐక్యత ఏకరీతితో కాదు. రాజ్యాంగ పరమైన విశ్వాసంతో నిలుస్తుందన్న సిద్ధరామయ్య అభిప్రాయాన్ని ఆయన సమర్థించారు.
