Let's talk: editor@tmv.in
ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ చరిత్రలో ’కురసావో‘సంచలనం

ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ చరిత్రలో ’కురసావో‘సంచలనం

Pinjari Chand
20 నవంబర్, 2025

ప్రపంచపటంలో వెతికితే కానీ దొరకని సూది మొనంతా చిన్న దేశం. ఫుట్‌బాల్ మైదానంలో మెరుగైన జట్లను ఓడిస్తూ భీకర గర్జన చేస్తోంది ఈ దేశం. ఫుట్ బాల్ మైదానంలో పెద్ద దేశాలకే చుక్కలు చూపిస్తోంది. కేవలం 443 చదరపు కిలోమీటర్లు,1.56 లక్షల జనాభా మాత్రమే కలిగిన చిన్న కరీబియన్ దేశం కురసావో. ఇంత చిన్నదేశం ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో సంచలనం సృష్టించింది. 2026లో ఉత్తర అమెరికాలో జరగనున్న పురుషుల ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించి‘డార్క్ హార్స్’లా దూసుకెళ్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఇది మా సమయం!’ అంటూ గోల్‌ పోస్ట్ పై దాడి చేయడానికి ముందుకు ఉరకలు వేస్తోంద. మొదటిసారిగా వరల్డ్ కప్ టికెట్ దక్కించుకుని చిన్న దేశం కూడా రికార్డులు నమోదు చేయగలదన్న నిజాన్ని ప్రపంచానికి రుజువు చేయడమే తమ లక్ష్యంగా ఎంచుకుంది. అర్హత సాధించి అభిమానలను, అందరినీ అశ్చర్యపరిచింది. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న దేశంగా రికార్డు తన పేరిట రాసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఐస్ ల్యాండ్ (3.5 లక్షల జనాభా – 2018 వరల్డ్‌కప్) పేరిట ఉండేది. CONCACAF 2026 పిఫా వరల్డ్​ కప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా జమైకాతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 0-0తో డ్రా చేసి గ్రూప్ టాప్‌లో నిలిచిన కురసావో, ట్రినిడాడ్ & టొబాగో, బెర్ముడా జట్లను వెనక్కు నెట్టి చరిత్ర సృష్టించింది.

నెదర్లాండ్స్‌ ఆటగాళ్లే బలం

నెదర్లాండ్స్‌ పరిధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం కురసావో. కొన్ని నెలలుగా తమ డయాస్పోరా ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు కృషి చేసింది. ఆగస్ట్‌ తరువాత మాత్రమే ఐదుగురు డచ్‌ యువజట్టు ఆటగాళ్లకు ఫిఫా అనుమతులతో కురసావో తరఫున ఆడే అవకాశం కల్పించారు. ఇందులో డిఫెండర్ జోషువా బ్రెనెట్ — 2016లో నెదర్లాండ్స్ తరఫున వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఆడిన ఆటగాడు — ఇప్పుడు కురసావో జెర్సీ వేసి ఆడటం ప్రత్యేకత. అలాగే పూర్వ మాంచెస్టర్ యునైటెడ్ యువ ఆటగాడు తాహిత్ చాంగ్ మాత్రమే జట్టులో కురసావోలో పుట్టి పెరిగిన కొద్దిమంది ఆటగాళ్లలో ఒకడు.

78 ఏళ్ల డిక్ అడ్వొకాట్ మాయ

ప్రసిద్ధ డచ్ కోచ్ డిక్ అడ్వొకాట్ (78) జట్టును వరల్డ్‌కప్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 1994లో నెదర్లాండ్స్‌ను, 2006లో దక్షిణ కొరియాను వరల్డ్‌కప్‌కు నడిపించిన అడ్వొకాట్… ఇప్పుడు మూడోసారి కోచ్‌గా గ్లోబల్ స్టేజ్‌ పైకి రానున్నారు. ఆయన కుటుంబ కారణాల రీత్యా జమైకా మ్యాచ్‌కు హాజరు కాలేకపోయినా జట్టు సత్తా చూపి పాయింట్‌ సాధించింది. జమైకా రెండో అర్థంలో మూడు సార్లు పోస్ట్‌ను తాకడం, స్టాపేజ్ టైమ్‌లో వచ్చిన పెనాల్టీ వీఏఆర్ రద్దు కావడంతో కురసావోకు అదృష్టం కలిసి వచ్చింది.

చిన్న క్లబ్‌లో ఆడినవారికి ఇప్పుడు వరల్డ్‌కప్ వేదిక

కురసావో జట్టులో ఇంగ్లాండ్ మూడో డివిజన్ రొథెరం, టర్కీ రెండో డివిజన్ బండర్మాస్పోర్, సౌదీ అరేబియాలోని అబ్‌హా వంటి చిన్న క్లబ్‌ల నుంచి వచ్చిన ఆటగాళ్లు ఉన్నారు. వరల్డ్‌కప్ వేదిక వారికి కెరీర్‌ను మార్చే అవకాశంగా మారనుంది. కురసావోతో పాటు పనామా, హైతీ కూడా మంగళవారం వరల్డ్‌కప్ అర్హతను సాధించాయి.

పనామా – ఎల్ సాల్వడార్‌పై 3-0 తేడాతో గెలిచి రెండోసారి వరల్డ్‌కప్‌కి అర్హత పొందింది.

హైతీ – నికరాగువాపై 2-0, గ్రూప్ ఫేవరెట్లైన హోండురాస్, కోస్టా రికాలను ఢీకొని 1974 తరువాత తొలిసారి వరల్డ్‌కప్ బెర్త్ సాధించింది.