
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ బీఆర్‌ఎస్ నిరసన
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టారు. దాదాపు రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ సుమారు రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆరోపించారు. ఈ కారణంగా పేద విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్న పరిస్థితి నెలకొన్నదని, ఇది వారి భవిష్యత్తుతో ఆడుకోవడమేనని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఈ బకాయిలన్నింటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కాలర్‌షిప్ పథకాలను విస్తృతంగా అమలు చేశారని గుర్తు చేశారు. అప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకే పరిమితమైన పూర్తి ఫీజు సబ్సిడీని బీసీలు, మైనారిటీలకు కూడా విస్తరించారని చెప్పారు. ర్యాంక్‌లో 10,000లోపు వచ్చిన విద్యార్థులకు 100 శాతం స్కాలర్‌షిప్ అందించేవారని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులకు రూ.2,500 కోట్ల వరకు సాయం అందేదని వివరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎంఎటీఎఫ్, ఆర్టీఎఫ్ (రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు)గా విభజించి అమలు చేసేవారని ఆయన చెప్పారు. ఎంఎటీఎఫ్ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారని, ఆర్టీఎఫ్‌ను విద్యాసంస్థలకు చెల్లిస్తారని వివరించారు.
అయితే గత రెండున్నర సంవత్సరాలుగా విద్యార్థులకు గానీ, కళాశాలలకు గానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆయన ఆరోపించారు. గతంలో ఉన్న రూ.2,500 నుంచి 3,000 కోట్ల బకాయిలు ఇప్పుడు నాలుగు విద్యా సంవత్సరాలకు పెరిగి రూ.12,000 కోట్లకు చేరాయని తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్‌లో కేవలం రూ.4,000 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది సమస్యను పరిష్కరించడానికి సరిపోదని విమర్శించారు.
