
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, నూతన విద్యా సంవత్సరంలో కూడా గతంలో అమలైన పాత విధానంలోనే దీనిని కొనసాగించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలను కాంక్షిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థులపై రికవరీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించడం అత్యంత అన్యాయమన్నారు. ఇది పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై పడుతున్న తీవ్ర ఆర్థిక భారాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని హితవు పలికారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకుని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత పద్ధతిలోనే పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, సామాజిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
