Let's talk: editor@tmv.in
ఫీజు బకాయిలపై విద్యార్థి ఉద్యమం ఉద్రిక్తం: పోలీసుల లాఠీచార్జి

ఫీజు బకాయిలపై విద్యార్థి ఉద్యమం ఉద్రిక్తం: పోలీసుల లాఠీచార్జి

Panthagani Anusha
9 డిసెంబర్, 2025

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనను చెదరగొట్టేందుకు దాడులకు ఒడిగట్టడంతో అక్కడ పరిస్థితి వేడెక్కింది.

విద్యార్థులపై లాఠీలు ఝళిపించిన పోలీసులు

ఫీజుల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను కరడుగట్టిన తీవ్రవాదుల మాదిరిగా పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖాకీలు ఒక్కసారిగా లాఠీ వాటం చూపించారు. నిరసనకారులను బూటు కాళ్ళతో కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి నెట్టారు. అరెస్టు చేసిన విద్యార్థులను దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదిలాఉండగా వైయస్ఆర్ సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ "చంద్రబాబు అబద్ధాలు వినీ వినీ మన రాష్ట్రంలో, 'నారా వారి మాటలు - నీటి మీద మూటలు' అనే కొత్త సామెత ర్తిగా మార్చేశారని, "అబద్ధం చెబితే గోడ కట్టినట్లుండాలి " అని సామెత మార్చుకోవాల్సిన దుస్థితి పుట్టుకొచ్చిందని" ఆయన ఎద్దేవా చేశారు.

రూ. 7,100 కోట్లు బకాయిలు: విద్యార్థులకు అన్యాయం

ఎన్నికల సమయంలో జగన్ పథకాలు ఆపనని, సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువగా అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని అటకెక్కించారని ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు: ఈ డిసెంబర్ నాటికి మొత్తం రూ. 5,600 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం రూ. 700 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, దీంతో ఇంకా రూ. 4,900 కోట్ల చెల్లించాల్సి ఉందని ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ఏప్రిల్‌లో విడుదల చేయాల్సిన వసతి దీవెన నిధులు ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయాయని, 2025 ఏప్రిల్ నాటికి ఈ బకాయిలు రూ. 2,200 కోట్లకు చేరుకుందని లెక్క చెప్పారు. అన్నీ కలుపుకొని విద్యార్థులకు ఈ ప్రభుత్వం మొత్తం రూ. 7,100 కోట్ల రూపాయలు బాకీ పడిందని ఆయన వివరించారు.

విద్యాశాఖ నిర్వీర్యం: లోకేష్‌పై విమర్శలు

విదేశాల్లో విద్యనభ్యసించిన లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ మెరుగవుతుందని ఆశించిన విద్యార్థులకు పూర్తి నిరాశే ఎదురైందని పానుగంటి చైతన్య నిందించారు. ఆయన నేతృత్వంలో విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యమై, విద్యార్థుల బంగారు భవిష్యత్తు అంధకారమయమై పోయిందని ఆరోపించారు. ఒకవైపు అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తంటాలు పడుతుంటే, మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు జీతాలు లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల కోసం విద్యార్థులు స్వయంగా కూలీ పనులకు వెళ్తున్న దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఏపీ అంతటా తాండవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని అడుగుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారని, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో ఓపిక నశించిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి సహా పలువురు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.

ఫీజు బకాయిలపై విద్యార్థి ఉద్యమం ఉద్రిక్తం: పోలీసుల లాఠీచార్జి - Tholi Paluku