
ఫీజు చెల్లించలేదని అమానుషం
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని ఋషి వాటిక గురుకులంలో జరిగిన దారుణ ఘటన ఒక 11 ఏళ్ల విద్యార్థి జీవితాన్ని చీకటిలోకి నెట్టింది. ఫీజు చెల్లింపు ఆలస్యమైందని కోపంతో స్కూల్ సిబ్బంది ఒకరు బాలుడిపై కర్రతో దాడి చేయడంతో విద్యార్థి కుడి కంటి చూపును శాశ్వతంగా కోల్పోయాడు.
స్థానిక సమాచారం ప్రకారం కలదివండ్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి శేషాద్రి రెడ్డిపై సెప్టెంబర్ మొదటి వారంలో ఈ దాడి జరిగింది. గురుకులంలో నాన్-టీచింగ్ సిబ్బందిగా పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి ఫీజు చెల్లించడంలో జాప్యం జరిగిందని ఆగ్రహించి, శేషాద్రి స్నేహితులతో ఆడుకుంటుండగా అతని కుడి కంటిపై కర్రతో బలంగా కొట్టాడు. ఈ దెబ్బకు తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని తిరుపతిలోని అరవింద్ ఐ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ గాయం తీవ్రత వల్ల విద్యార్థి కంటి చూపును కాపాడలేకపోయారు.
సవాల్ విసిరిన స్కూల్ యాజమాన్యం
శేషాద్రి తండ్రి అమర్నాథ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మా కొడుకు ఉజ్వల భవిష్యత్తు కోసం స్కూల్లో చేర్పించాం. కానీ చిన్న ఫీజు ఆలస్యం కారణంగా అతని జీవితం నాశనమైంది అని కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాక, స్కూల్ యాజమాన్యం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వబోమని, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోమని సవాల్ విసిరినట్లు ఆయన ఆరోపించారు.
పోలీసుల నిర్లక్ష్యం పై ఆగ్రహం
ఈ దారుణంపై కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనప్పటికీ, నిందితుడిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంతేకాక ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. స్కూల్ ప్రతిష్టను కాపాడేందుకు మా కొడుకు న్యాయాన్ని తాకట్టు పెడుతున్నారు. స్థానిక పోలీసులు, స్కూల్ యాజమాన్యం కుమ్మక్కై కేసును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు," అని అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బాలల హక్కుల సంఘాల డిమాండ్‌లు
ఈ ఘటనపై బాలల హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. నిందితుడైన వెంకటేష్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి హింసను అనుమతించిన ఋషి వాటిక గురుకులం గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాక సేషాద్రి వైద్య, విద్యా ఖర్చుల కోసం రూ. 1 కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, బాలల సంక్షేమ కమిటీ జోక్యం చేసుకోవాలని కోరారు.
