Let's talk: editor@tmv.in
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 6.7 తీవ్రతతో వణికిన ద్వీపం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 6.7 తీవ్రతతో వణికిన ద్వీపం

Shaik Mohammad Shaffee
8 జనవరి, 2026

ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం (ఫివోల్క్స్) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:02 గంటలకు మిందనావో ద్వీపం సమీపంలోని సముద్ర గర్భంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమికి సుమారు 42 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

భయాందోళనకు గురైన ప్రజలు

ఈ భూకంప కేంద్రం దావావో ఒరియంటల్ ప్రావిన్స్‌లోని మనాయ్ తీరానికి సుమారు 47 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో ఉందని అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో మిండానావో దీవిలోని చాలా ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. తీర ప్రాంతాల్లోనే కాకుండా, భూభాగం లోపల ఉన్న ఊళ్లలో కూడా భూప్రకంపనలు రావడంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పోలీసులు, విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. సముద్రంలో భూకంపం వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

ఫివోల్క్స్ సంస్థ ఈ భూకంపం తర్వాత చిన్నచిన్న ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో స్వల్పంగా నష్టం జరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. కాబట్టి ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు నివారించాలని అధికారులు సూచించారు. భద్రతా సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

ఇటీవలి నెలల్లో ఫిలిప్పీన్స్‌లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. 2025 డిసెంబర్ 22న సముద్రంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు అక్టోబర్ నెలలో మధ్య ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ నష్టం కలిగించింది. ఆ సమయంలో ప్రాణ నష్టం, విద్యుత్ అంతరాయం చోటు చేసుకున్నాయి. సునామీ హెచ్చరిక కూడా జారీ చేయగా, తర్వాత అది ఉపసంహరించుకున్నారు.

ఫిలిప్పీన్స్‌లో తరచూ భూకంపాలు ఎందుకు?

ఫిలిప్పీన్స్ ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో ఒకటి. ఇది పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” అనే ప్రమాదకర భూకంప ప్రాంతంలో ఉంది. ఇక్కడ భూమి లోపల పెద్ద పెద్ద టెక్టానిక్ పలకలు ఒకదానితో ఒకటి ఢీకొంటూ కదులుతుంటాయి. తూర్పు వైపు ఫిలిప్పీన్ సీ ప్లేట్, పశ్చిమ వైపు యూరేషియన్ ప్లేట్ ప్రభావం వల్ల భూకంపాలు తరచుగా వస్తుంటాయి. ఈ రెండు వైపుల నుంచి భూభాగం కిందకు పలకలు జారడం వల్ల భూమిలో భారీ ఒత్తిడి ఏర్పడుతుంది. దీనినే శాస్త్రవేత్తలు “డబుల్ సబ్‌డక్షన్” అంటారు. ఈ కారణంగానే ఫిలిప్పీన్స్‌లో తరచూ భూకంపాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.