Let's talk: editor@tmv.in
ఫిరాయింపుల కేసు.. దానం, కడియంపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్

ఫిరాయింపుల కేసు.. దానం, కడియంపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్

Gaddamidi Naveen
12 మార్చి, 2026

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశానికి తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కొట్టివేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో మొత్తం 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన వివాదం ఒక ముగింపునకు వచ్చింది.

స్పీకర్ తాజా నిర్ణయంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలకు ఊరట లభించింది. గతంలోనే ఇతర ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో పది మంది ఎమ్మెల్యేలపై ఉన్న వివాదం ముగిసింది.

ప్రతిపక్షాల ఆగ్రహం

ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. పార్టీ మార్పులను ప్రోత్సహించేలా తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల తీర్పును అవమానించే విధంగా ఈ నిర్ణయం ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కేటీఆర్ తన వ్యాఖ్యల్లో దానం నాగేందర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమేనని ఆయన విమర్శించారు.

ఇక బీఆర్ఎస్ కూడా స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ, ఈ నిర్ణయం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి మాట్లాడే మాటలకు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న చర్యలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.అదేవిధంగా, ఈ నిర్ణయం ద్వారా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలను కాంగ్రెస్ అవమానించినట్లుగా ఉందని కూడా ఆయన విమర్శించారు.

ఎమ్మెల్యేల సమర్థన

అయితే ఈ విమర్శలను దానం నాగేందర్ తిరస్కరించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక పౌరుడిగా తన ప్రాథమిక హక్కు అని దానం పేర్కొన్నారు. తాను బీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, అలాగే కాంగ్రెస్ సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదని వాదించారు. సభలో తన పనితీరు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా లేదని ఆయన స్పష్టం చేశారు.

కడియం శ్రీహరి కూడా ఈ అంశంపై స్పందిస్తూ, తమపై దాఖలైన అనర్హత పిటిషన్లు చట్టబద్ధం కావని అభిప్రాయపడ్డారు. ఆ పిటిషన్లు పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేయడం సరైన విధానం కాదని ఆయన అన్నారు. ఇక గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్న విషయాన్ని కూడా శ్రీహరి గుర్తు చేశారు. అప్పుడు జరిగిన చర్యలపై బీఆర్ఎస్ ప్రజలకు క్షమాపణ చెప్పితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారంటూ బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ, న్యాయపోరాటం జరిగిన తర్వాత, స్పీకర్ అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు.

10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్

స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన మొత్తం పది మంది ఎమ్మెల్యేలలో కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), డా. సంజయ్ కుమార్ (జగిత్యాల), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్) ఉన్నారు.