
ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న ‘72 ది లీగ్’ గోల్ఫ్ టోర్నీ
ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా గురువారం దేశవ్యాప్తంగా గోల్ఫ్ అభిమానులను ఆకర్షించే కొత్త ఫ్రాంచైజీ లీగ్‌ను ప్రకటించింది. ‘72 ది లీగ్’ అనే ఈ టోర్నమెంట్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు జరగనుంది. దేశంలో గోల్ఫ్‌కు కొత్త ఊపు తెచ్చేందుకు, మరింత మంది ప్రొఫెషనల్ క్రీడాకారులకు అవకాశాలు కల్పించేందుకు ఇది ఏర్పాటు చేసిన ప్రత్యేక లీగ్‌గా నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ లీగ్‌లో మొత్తం ఆరు నగరాల ఆధారిత జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టులో 10 మంది ప్రొఫెషనల్ గోల్ఫర్లు ఉంటారు. వీరిని వచ్చే జనవరిలో జరగనున్న వేలం ద్వారా ఎంపిక చేస్తారు. డిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలోని మూడు ప్రముఖ గోల్ఫ్ గ్రౌండ్లైన క్లాసిక్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్, జయ్‌పీ గ్రీన్స్, కుతబ్ గోల్ఫ్ కోర్స్‌లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ సంవత్సరమే ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన నేపథ్యంలో, ఇదే సమయంలో ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా కొత్త లీగ్‌ను తీసుకురావడం ఎందుకని ప్రశ్నించగా, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కపిల్ దేవ్ స్పందిస్తూ, గోల్ఫ్‌ను దేశంలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమసంస్థదేనని, ఇతరుల వాణిజ్య ఉద్దేశాలు వేరు కావొచ్చని చెప్పారు. ఆయన మాటల్లో, ‘మొదటిసారిగా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ విధమైన క్రమబద్ధమైన జట్ల ఆధారిత జాతీయ లీగ్ ప్రారంభం అవుతోంది. ఇది భారత గోల్ఫ్ పురోగతికి కొత్త అధ్యాయం.’
ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా సీఈఓ అమన్‌దీప్ జోహ్ ఈ లీగ్ రావడం వల్ల సుదీర్ఘ సంవత్సర కాలంపాటు జరిగే సీరియస్ టోర్నమెంట్‌ల మధ్యలో ఒక కొత్తదనం వచ్చి, క్రీడాకారులకు తమ ప్రతిభను మరో రూపంలో చూపించే అవకాశం లభిస్తుందని అన్నారు. అమెరికాలో రైడర్ కప్ ఎలా ఉత్సాహాన్ని పెంచుతుందో, అలాంటి టీమ్ ఫార్మాట్ భారత్‌లో కూడా గోల్ఫ్‌కు ఊతమిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఐ పి ఎల్ తరహాలో విదేశీ గోల్ఫర్లు కూడా ఈ లీగ్‌లో భాగమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
లీగ్ నిర్మాణం వల్ల టాప్ ర్యాంక్ ఆటగాళ్లకే కాదు, అనుభవం ఉన్నా ర్యాంకింగ్‌లో దిగువన ఉన్న క్రీడాకారులకు కూడా అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. యువ గోల్ఫర్లకు నేర్చుకునే వేదికగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. పి జి ఏ ,డి పి వరల్డ్ టూర్, సన్‌షైన్ టూర్‌లతో తమ సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నామని, భవిష్యత్తులో ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా దక్షిణాసియాలో ఒక పెద్ద టూర్‌గా ఎదిగే అవకాశాలున్నాయని జోహ్ వివరించారు.
లీగ్‌లో మ్యాచ్-ప్లే పద్ధతిలో పోటీలు, ప్రో-యామ్ ఈవెంట్లు, అభిమానుల కోసం ప్రత్యేక జోన్లు, ప్రత్యక్ష వినోద కార్యక్రమాలు, మెరుగైన ప్రసార సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇవన్నీ కలిసి సాధారణ ప్రజలకు గోల్ఫ్‌ను మరింత దగ్గర చేసే ప్రయత్నంగా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
