
ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు
వచ్చే ఏడాది జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన తుది డేట్ షీట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని బోర్డు పేర్కొంది. సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ప్రకటించిన వివరాల ప్రకారం, 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17, 2026వ తేదీన ప్రారంభమై మార్చి 10వ తేదీ వరకు, అలాగే 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17, 2026న ప్రారంభమై ఈఫిల్ 9 వరకు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ప్రతీ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి.
సాధారణంగా కంటే ఈసారి పరీక్షలకు 110 రోజుల ముందే తుది డేట్ షీట్‌లను సీబీఎస్ఈ విడుదల చేసింది. గత నెలలో బోర్డు తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే, చివరి షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేశారు ముఖ్యంగా 10వ తరగతికి అదనంగా ఒక రోజు చేర్చారు.
10వ తరగతి బోర్డు పరీక్షలు- ఏడాది రెండుసార్లు
ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం కూడా ఇదే తొలిసారి. మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయి. రెండవ దశ పరీక్షలు మే 15 నుండి జూన్ 1, 2026 వరకు జరగనున్నాయి. పరీక్షల నియంత్రణాధికారి సన్యమ్ భారద్వాజ్ మాట్లాడుతూ, “ఇరువురు తరగతుల విద్యార్థులు సాధారణంగా ఎంచుకునే రెండు సబ్జెక్టుల మధ్య సరిపడ విరామం ఇచ్చాం. 12వ తరగతి విద్యార్థుల ప్రవేశ పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుని, బోర్డు పరీక్షలు వాటి కంటే ముందే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం. ఇది విద్యార్థులకు సమయ నిర్వహణలో సహాయపడుతుంది” అని తెలిపారు.
సబ్జెక్ట్ తేదీల్లో మార్పులు
10వ తరగతిలో డేటా సైన్స్, ఫ్రెంచ్, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, తమిళం, రిటైల్, సెక్యూరిటీ, ఆటోమోటివ్ వంటి సబ్జెక్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. 12వ తరగతిలో బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, అకౌంటెన్సీ వంటి సబ్జెక్టులు కూడా సవరించబడ్డాయి.
“40,000కు పైగా సబ్జెక్ట్ కాంబినేషన్లను పరిగణనలోకి తీసుకుని, విద్యార్థులు ఎంచుకున్న రెండు సబ్జెక్టులు ఒకే రోజున రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం” అని సన్యమ్ భారద్వాజ్ అన్నారు. అలాగే “జేఈఈ (మెయిన్) పరీక్షలతో సీబీఎస్ఈ పరీక్షలు ఒకే రోజున రాకుండా చూసేందుకు, విద్యార్థుల 11వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్లు జేఈఈ దరఖాస్తులో తప్పనిసరిగా నమోదు చేయాలని ఎన్ టీఏ కోరింది. అందుకే పాఠశాలలు తమ విద్యార్థులకు ఆ వివరాలను అందించాలని సూచించాం” అని చెప్పారు.
రెండవ దశ పరీక్షలు
10వ తరగతికి మే నెలలో జరగనున్న రెండవ దశ బోర్డు పరీక్షలు ఐచ్ఛికం. విద్యార్థి రెండు దశలలోనూ పరీక్ష రాస్తే, రెండింటిలో అత్యుత్తమ ఫలితాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. రెండు దశలూ పూర్తి వార్షిక సిలబస్ ఆధారంగా జరుగుతాయి. పరీక్షా విధానం రెండూ ఒకటే ఉంటాయి.
ప్రస్తుతం విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల ద్వారా స్కోర్‌లను మెరుగుపరచుకునే అవకాశం ఉండగా, ఈ కొత్త విధానంలో రెండవ దశ పరీక్షనే సప్లిమెంటరీ పరీక్షగా ఉపయోగపడుతుంది. దీనికి ప్రత్యేకంగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడవు అని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
