Let's talk: editor@tmv.in
ఫిబ్రవరి 17న భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

ఫిబ్రవరి 17న భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

Shaik Mohammad Shaffee
11 ఫిబ్రవరి, 2026

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫిబ్రవరి 17న భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు, కృత్రిమ మేధ (ఏఐ), సాంకేతిక రంగాలలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

హొరైజన్ 2047: వ్యూహాత్మక భాగస్వామ్యం

ఈ పర్యటనలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ మధ్య విస్తృతస్థాయి చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా 'హొరైజన్ 2047' రోడ్‌మ్యాప్ కింద ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించనున్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సహకారం, రక్షణ, అంతరిక్షం, ఇంధన రంగాలలో పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకోనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో కుదిరిన ఒప్పందాల పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించనున్నారు.

మొట్టమొదటి 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'

ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 20 వరకు జరగనున్న 'ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో మాక్రాన్ పాల్గొననున్నారు. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాలు) వేదికగా జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇదే కావడం విశేషం. 'పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్' అనే మూడు సూత్రాల ఆధారంగా జరిగే ఈ సదస్సులో ఏఐ వల్ల కలిగే సామాజిక మార్పులు, సుస్థిర అభివృద్ధిపై మేధోమథనం జరగనుంది. ఈ సదస్సులో భాగంగా 70 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న 'ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో'లో 30 దేశాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.

ముంబైలో ‘ఇన్నోవేషన్ ఇయర్’ ప్రారంభం

ఢిల్లీ పర్యటన అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముంబై చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీతో కలిసి 'ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026'ను ఉమ్మడిగా ప్రారంభించనున్నారు. 2026 సంవత్సరం పొడవునా ఇరు దేశాల్లో జరిగే ఈ వేడుకల ద్వారా పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధి చెందుతున్న కీలక సాంకేతికతల్లో పరస్పర సహకారానికి ఈ చొరవ పెద్దపీట వేయనుంది.