
ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(1) ప్రకారం తనకు ఉన్న అధికారాలను వినియోగించి వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ఉభయ సభలను సమావేశపరుస్తున్నట్లు గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 12న ఈ చర్చ ప్రారంభం కాగా 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే జరిగే బి.ఎ.సి సమావేశంలో సభ పనిదినాలు ఎజెండాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాలు దాదాపు నాలుగు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విడత సమావేశాల్లో అత్యంత కీలకమైన 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సభ ముందు ఉంచనున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకోబోయే కీలక నిర్ణయాలు, ఆర్థిక ప్రణాళికలు ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపులపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ జరగనుంది.
