
ఫిబ్రవరి 1 తర్వాత జారీ చేసే కొత్త ఫాస్టాగ్ కార్లకు కెవైవి నిలిపివేత!
ప్రజల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, మరింత సులభతరమైన ఫాస్టాగ్ అనుభవాన్ని అందించడానికి, 1 ఫిబ్రవరి 2026 నుండి జారీ చేయబడే అన్ని కొత్త కార్ల కేటగిరీ (కార్/జీపు/వ్యాన్) ఫాస్టాగ్‌లకు 'నో యువర్ వెహికల్' ప్రక్రియను నిలిపివేయాలని భారత జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది.
వివరాల్లోకి వెళితే, ఫిబ్రవరి 1, 2026 తర్వాత తీసుకునే కార్ల ఫాస్టాగ్‌లకు ఇకపై కెవైవి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న కార్ల ఫాస్టాగ్‌లకు కూడా కెవైవి ఇకపై సాధారణ ప్రక్రియగా ఉండదు. అయితే, ఫాస్టాగ్ దుర్వినియోగం, తప్పుగా జారీ చేయడం లేదా లూజ్ ఫాస్టాగ్‌లకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ ప్రక్రియను చేపడతారు.
ఫాస్టాగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికతతో కూడినదిగా ప్రజలకు అనుకూలంగా మార్చడానికి భారత జాతీయ రహదారుల సంస్థ ఈ సంస్కరణలను చేపట్టింది. దీనివల్ల జాతీయ రహదారుల వినియోగదారులకు ఫిర్యాదులు తగ్గి, ప్రయాణం మరింత సాఫీగా సాగుతుంది.
అసలు ఈ కెవైవి ఎందుకు పెట్టారు?
ప్రారంభంలో కొన్ని అవకతవకలను అరికట్టడానికి ఈ నియమాన్ని తెచ్చారు. పెద్ద వాహనాలు (ట్రక్కులు, బస్సులు) తక్కువ టోల్ పడే కార్ కేటగిరీ ట్యాగ్‌లను వాడుకోకుండా ఉండటానికి, వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు, క్లాస్, ట్యాగ్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి, ఒకే వాహనంపై ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు ఉండకుండా నియంత్రించడానికి అమలు చేశారు.
ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు?
సాంకేతికత పెరగడం వల్ల ఇప్పుడు కెవైవి ప్రక్రియ మనుషుల ప్రమేయం లేకుండానే జరుగుతోంది. ఇప్పుడు ఫాస్టాగ్ జారీ చేసేటప్పుడే అది నేరుగా ప్రభుత్వ 'వాహన్' పోర్టల్‌తో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల వాహనం నంబర్ ఎంటర్ చేయగానే దాని మోడల్, క్లాస్ వివరాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి విడిగా కెవైవి చేయాల్సిన అవసరం తగ్గింది. కెవైవి అప్‌డేట్ చేయకపోతే ట్యాగ్‌లు బ్లాక్ అవ్వడం, టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఇబ్బంది పడటం వంటి ఫిర్యాదులు పెరిగాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యుడిపై డాక్యుమెంటేషన్ భారాన్ని తగ్గించడం భారత జాతీయ రహదారుల సంస్థ ప్రధాన ఉద్దేశ్యం.
దీనివల్ల సామాన్యుడికి కలిగే లాభం ఏమిటి?
ఈ నిర్ణయం వల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం ఇప్పుడు చాలా సులభం, వేగంగా పూర్తవుతుంది. కెవైవి అప్‌డేట్ చేయలేదనే కారణంతో ట్యాగ్‌లు నిలిపివేయబడవు (బ్లాక్ చేయబడవు). ట్యాగ్ పని చేయకపోతే టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో డబుల్ పేమెంట్ చేయాల్సిన పరిస్థితి తప్పుతుంది. పదే పదే ఫోటోలు తీయడం లేదా వాహనం వద్దకు వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.
క్లుప్తంగా చెప్పాలంటే, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో వాహనం వివరాలను ప్రభుత్వం తన వద్ద ఉన్న డేటాతోనే సరిచూసుకోగలదు. అందుకే ప్రజల మీద భారం పడకుండా ఉండటానికి ఈ అదనపు వెరిఫికేషన్ స్టెప్‌ను తొలగించారు.
