Let's talk: editor@tmv.in
ఫిబ్రవరి నుంచి ఢిల్లీ-లండన్ మధ్య ఇండిగో నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు

ఫిబ్రవరి నుంచి ఢిల్లీ-లండన్ మధ్య ఇండిగో నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు

Shaik Mohammad Shaffee
25 డిసెంబర్, 2025

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఫిబ్రవరి 2, 2026 నుంచి ఢిల్లీ నుంచి లండన్ హీత్రో విమానాశ్రయానికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ రూట్‌లో వారానికి ఐదు రోజులు విమానాలు నడపనుంది. ఇందుకోసం బోయింగ్ 787 విమానాలను ఉపయోగించనుంది.

ఈ విమానాల్లో ప్రయాణికులకు రెండు రకాల సీటింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఒకటి ‘ఇండిగో స్ట్రెచ్’ (కొంచెం ఎక్కువ లెగ్ స్పేస్‌తో), రెండోది సాధారణ ఎకానమీ క్లాస్. దీని వల్ల ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇండిగో ఇప్పటికే ముంబై నుంచి లండన్ హీత్రోకు ప్రతిరోజూ నేరుగా విమానాలు నడుపుతోంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా ఈ సేవలు ప్రారంభం కావడంతో, లండన్‌కు ఇండిగో వారానికి మొత్తం 12 విమానాలు నడపనుంది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విమానం (6ఈ 0003) ఉదయం 9:40కి బయలుదేరి మధ్యాహ్నం 2:55కి లండన్ చేరుతుంది. ఈ విమానం సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజుల్లో అందుబాటులో ఉంటుంది. లండన్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానం (6ఈ 0004) సాయంత్రం 5:15కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:15కి ఢిల్లీ చేరుకుంటుంది.

ఈ సందర్భంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ, భారత్-బ్రిటన్ మధ్య ప్రయాణ డిమాండ్ వేగంగా పెరుగుతోందన్నారు. వ్యాపారం, పర్యాటకం, కుటుంబ సభ్యులను కలవడం వంటి అవసరాల కోసం ఈ డైరెక్ట్ ఫ్లైట్స్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభంగా, అందుబాటులో ఉంచడమే ఇండిగో లక్ష్యమని చెప్పారు.

ఢిల్లీ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచే దిశగా ఇండిగో ఇప్పటికే డెన్పసార్, క్రాబీ, హనోయ్, గ్వాంగ్‌జౌ, మాంచెస్టర్ వంటి నగరాలకు విమానాలు ప్రారంభించింది. అలాగే 2026 జనవరిలో ఏథెన్స్‌కు నేరుగా విమానాలు ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది.

గత ఏడాది కాలంలో ఇండిగో 10 కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాలను, 30కిపైగా కొత్త అంతర్జాతీయ రూట్లను ప్రారంభించింది. తక్కువ ధరల్లో టికెట్లు, సమయపాలనపై దృష్టి పెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ తెలిపింది.

ఈ లండన్ ప్రయాణం కోసం ఇండిగో సంస్థ 'నోర్స్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్' అనే విదేశీ కంపెనీ నుండి కొన్ని విమానాలను అద్దెకు (లీజుకు) తీసుకుంటోంది. ఈ విమానాలు భారీగా ఉండటమే కాకుండా, విదేశీ ప్రయాణాలకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలతో ఉంటాయి. దీనివల్ల ఢిల్లీ నుండి లండన్ వరకు చేసే సుదీర్ఘ ప్రయాణం ప్రయాణికులకు చాలా హాయిగా, సౌకర్యవంతంగా అనిపిస్తుందని ఇండోగో అధికారులు తెలిపారు.