
ఫిబ్రవరి కల్లా వైఎస్సార్‌సీపీ కమిటీల పునర్నిర్మాణం పూర్తి కావాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కమిటీల నియామకాన్ని ఒక 'స్పెషల్ డ్రైవ్'లా భావించి ఫిబ్రవరి మొదటి వారానికల్లా ప్రక్రియను పూర్తి చేయాలని నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిని ప్రతి నాయకుడు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు.
ముఖ్యంగా విలేజ్, వార్డు స్థాయి కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సజ్జల సూచించారు. డేటా ప్రొఫైలింగ్‌లో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదని, ప్రతి వివరమూ పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ కేవలం నియామకాలకే పరిమితం కాకుండా సుమారు 15 లక్షల మంది కార్యకర్తలతో కూడిన ఒక క్రమబద్ధమైన సైన్యాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా సాగాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రతి కార్యకర్తకు సమాచారం నేరుగా చేరేలా సాంకేతికతను జోడిస్తున్నామని ఇందుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి డిజిటల్ మేనేజర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
కమిటీల నియామక ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ నాయకులతో కూడిన 'టాస్క్ ఫోర్స్' టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగిందని సజ్జల తెలిపారు. కడప పార్లమెంట్, వేమూరు, పుంగనూరు, మడకశిర వంటి నియోజకవర్గాల్లో మైక్రో లెవల్ నియామకాలు సైంటిఫిక్ పద్ధతిలో పూర్తయ్యాయని వాటిని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. అ
చివరగా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపును సులభతరం చేసే విధంగా ఈ కమిటీల నిర్మాణం ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డేటా ప్రొఫైలింగ్ సవ్యంగా ఉంటే భవిష్యత్తులో పార్టీకి అనేక ప్రయోజనాలు ఉంటాయని పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల ఏర్పాటు కూడా నాయకులకు అగ్నిపరీక్ష వంటిదని ఆయన వ్యాఖ్యానించారు.
