
ఫిబా 3x3 ఆసియా కప్: మెయిన్ డ్రాలోకి భారత్
ఫిబా 3x3 ఆసియా కప్ బాస్కెట్‌బాల్ టోర్నీలో భారత జట్లు మిశ్రమ ఫలితాలు సాధించాయి. సింగపూర్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత పురుషుల జట్టు సంచలన ప్రదర్శనతో ప్రధాన డ్రాకు అర్హత సాధించగా.. మహిళల జట్టు మాత్రం క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మహిళల జట్టుకు నిరాశే ఎదురైంది.
నేడే అసలైన సమరం
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 83వ స్థానంలో ఉన్న భారత పురుషుల జట్టు అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. బుధవారం జరిగిన క్వాలిఫైయింగ్ పూల్-డి మ్యాచుల్లో బలమైన ప్రత్యర్థులను చిత్తు చేసింది. ముఖ్యంగా ప్రపంచ 19వ ర్యాంకర్ బహ్రెయిన్‌ను 21-12తో మట్టికరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్‌లో హర్ష దాగర్ 15 పాయింట్లతో వీరవిహారం చేశాడు. అంతకుముందు జరిగిన ఉత్కంఠ పోరులో కజకిస్తాన్‌ను 20-18తో, హాంకాంగ్‌ను 19-18తో భారత్ ఓడించింది. ప్రణవ్ ప్రిన్స్ (9 పాయింట్లు), అరవింద్ ముత్తు కీలక సమయంలో రాణించి జట్టును గెలిపించారు. ప్రధాన డ్రాకు చేరిన భారత పురుషుల జట్టు.. నేడు పూల్-డిలో భాగంగా ఖతార్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది. గత ఏడాది 12 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌కు చేరిన భారత్, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.
మహిళా జట్టుకు మలేషియా షాక్
మరోవైపు గురువారం జరిగిన మహిళల క్వాలిఫైయింగ్ మ్యాచుల్లో భారత్‌కు నిరాశ తప్పలేదు. పూల్-బిలో భాగంగా మలేషియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 13-16తో ఓటమి పాలైంది. ఒక దశలో 6-4తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత మలేషియా ప్లేయర్లు పుంజుకోవడంతో భారత్ వెనుకబడింది. పుష్ప సెంథిల్ కుమార్ (6 పాయింట్లు), ధర్శిని పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండో మ్యాచ్‌లో తుర్క్మెనిస్తాన్‌పై 21-4తో భారత్ ఏకపక్ష విజయం సాధించినా.. అప్పటికే రెండు మ్యాచులు నెగ్గిన మలేషియా గ్రూప్ టాపర్‌గా ప్రధాన డ్రాకు అర్హత సాధించింది. దీంతో గ్రూప్ దశ నుంచే భారత మహిళలు నిష్క్రమించారు. 2013లో తొలి ఎడిషన్ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు, వరుసగా రెండో ఏడాది ప్రధాన డ్రాకు అర్హత సాధించలేకపోవడం గమనార్హం.
