
‘ఫిఫా వరల్డ్‌కప్’ కల సజీవంగానే ఉంది: ఆశాలతా దేవి
భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడాలనే కల ఇంకా సజీవంగానే ఉందని, అయితే ప్రపంచ స్థాయి జట్లతో పోటీ పడాలంటే ప్రారంభ స్థాయిలో నిరంతర అభివృద్ధి అత్యవసరమని భారత మహిళల ఫుట్‌బాల్ దిగ్గజం ఆశాలతా దేవి స్పష్టం చేశారు. మన వరల్డ్‌కప్ కల ఇంకా బతికే ఉంది. ఈ దశలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అండర్–17, అండర్–19, సీనియర్ జట్లు ఇప్పటికే తమ తమ ఏఎఫ్‌సీ (ఆసియా) చాంపియన్‌షిప్‌లకు అర్హత సాధించాయని గుర్తు చేసిన ఆమె, 2026 సంవత్సరం భారత మహిళల ఫుట్‌బాల్‌కు కీలక మలుపు కావచ్చని అభిప్రాయపడ్డారు. భారత మహిళల ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఒకరైన ఆశాలతా, 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటంతో పాటు పలు సందర్భాల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. సీనియర్ జట్టు ఆటలో మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఇంకా చేరలేదని ఆమె అంగీకరించారు. మనం కొన్నేళ్లుగా మెరుగ్గా ఆడుతున్నాం. కానీ ప్రపంచ స్థాయి జట్లతో పోలిస్తే ఇంకా ఆ స్థాయికి చేరలేదు. అయినా ప్రయత్నం మాత్రం ఆగడం లేదని అన్నారు. ఆటగాళ్లపై నాకు అపారమైన నమ్మకం ఉంది. వారి పట్టుదల, కష్టపడే తత్వం ఎంతో గొప్పది. ఈసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించి, భారత మహిళల ఫుట్‌బాల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. పది సంవత్సరాలకు పైగా భారత రక్షణ విభాగాన్ని నడిపించిన ఆశాలతా, గ్రాస్‌రూట్ అభివృద్ధే ప్రధాన లోటుగా పేర్కొన్నారు. మనం మౌలిక అంశాలను వదిలేసి నేరుగా టెక్నికల్ విషయాలకే వెళ్తున్నాం. అదే సమస్య అని ఆమె అన్నారు.
వయస్సు పెరిగేకొద్దీ శిక్షణ కష్టమవుతుంది
నేను 13 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ మొదలుపెట్టాను. ఇప్పుడు పిల్లలు 10 లేదా 11 ఏళ్లకే మొదలుపెడుతున్నారు. కానీ 5 లేదా 6 ఏళ్ల నుంచే శిక్షణ మొదలుపెడితే నేర్చుకోవడం మరింత సులభం అవుతుందని వివరించారు. వయసు పెరిగేకొద్దీ నైపుణ్యాలు నేర్పడం కష్టమవుతుందని ఆమె చెప్పారు. 17 లేదా 18 ఏళ్ల తర్వాత బాల్ కంట్రోల్ వంటి నైపుణ్యాలు నేర్పడం చాలా కష్టం. అప్పటికి ఆటగాళ్లు నేర్చుకోవడం కన్నా అనుభవంతో ఆడతారు. అందుకే గ్రాస్‌రూట్ ఫుట్‌బాల్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) పాత్రను గుర్తించిన ఆశాలతా, రాష్ట్ర సంఘాల బాధ్యత కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఏఐఎఫ్‌ఎఫ్‌కు పెద్ద పాత్ర ఉంది. కానీ ప్రతి రాష్ట్రానికి తమ తమ సంఘాలు ఉన్నాయి. అవి ఆసక్తి చూపించి ముందడుగు వేయాలి. అన్నీ పై స్థాయిలోనే జరగవని అన్నారు. మైదానం బయట కూడా ఫుట్‌బాల్‌కు సేవ చేయాలనే లక్ష్యంతో ఆశాలతా ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. సహచర అంతర్జాతీయ ఆటగాళ్లైన ఆదితి చౌహాన్‌తో కలిసి ఇంఫాల్‌లో ఆశాలతా దేవి ఫుట్‌బాల్ ఫెస్టివల్ (ఏడీఎఫ్ఎఫ్) ప్రారంభించారు.
నా సమస్య ఇతరులకు రావద్దు
రిటైర్మెంట్ తర్వాత ఫుట్‌బాల్ తప్ప ఇంకేమి చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఇంకా ఫుట్‌బాల్‌తోనే అనుబంధంగా ఉండాలనిపించిందని ఆమె తెలిపారు. తన అనుభవాలే ఈ కార్యక్రమానికి ప్రేరణ అని పేర్కొన్న ఆశాలతా, విద్య–ఫుట్‌బాల్ మధ్య పిల్లలు ఇబ్బంది పడకూడదనేదే లక్ష్యమన్నారు. నా చిన్నప్పుడు ఇంటి దగ్గర అకాడమీ లేకపోవడంతో చదువు, ఫుట్‌బాల్ రెండింటినీ సమతుల్యం చేయలేకపోయాను. ఆ సమస్య తదుపరి తరం పిల్లలకు రావద్దని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఊహించని స్పందన లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 50 మంది పిల్లలు వస్తారని అనుకున్నాం. కానీ 47–48 మంది పిల్లలు వచ్చారు. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉందన్నారు.
